టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు భార్య స్వర్గస్తులయ్యాక.. ఆయన ఒంటరిగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే గత కొంతకాలంగా ఆయన రెండో వివాహం చేసుకోనున్నారని మీడియాలో ప్రచారం హోరెత్తింది. తాజా సమాచారం ప్రకారం.. నిజామాబాద్ లో 10 మే 2020 సాయంత్రం ఆయన వివాహం జరిగిందని తెలుస్తోంది. కరోనా లాక్ డౌన్ కారణంగా అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలోనే ఈ వివాహం జరిగిందట.
దిల్ రాజు సొంత గ్రామమైన నిజామాబాద్ జిల్లాలోని నర్సింగ్ పల్లిలో తన ఇష్టదైవమైన శ్రీవెంకటేశ్వర స్వామీ దేవాలయంలో దిల్ రాజు వివాహం జరిగిందని.. ఈ పెళ్లిని రాజు గారి కుమార్తె హన్షిత దగ్గరుండి జరిపించారని చెబుతున్నారు. అయితే రాజుగారు కులాంతర వివాహం చేసుకున్నారన్న చర్చ తాజాగా పరిశ్రమలో ఆసక్తికర చర్చకు తావిచ్చింది.
రాజుగారు తనకు ఎంతో సుపరిచితురాలైన ఓ బ్రాహ్మణ యవతిని పెళ్లాడారట. తను ఇదివరకూ ఎయిర్ హోస్టెస్ వృత్తిలో కొనసాగారని.. ఫ్యామిలీ అమెరికాలో స్థిరపడిందని సమాచారం. ఇక దిల్ రాజు పెళ్లికి పెద్దగా ఆమె కూతురు హన్షిత రెడ్డి అన్నీ తానై చూసుకుంటుందట. 2014లోనే హన్షిత రెడ్డి వివాహమైంది. 2017లో తన తల్లిని కోల్పోయారు. అప్పటి నుంచి తన తండ్రికి రెండో పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్న హన్షిత రెడ్డి పట్టు బట్టి మరీ ఈ పెళ్లిని జరిపించారట. తన వివాహ విషయాన్ని దిల్ రాజు వెల్లడించకపోయినా తన జీవితంలో కీలక ఘట్టానికి సమయమాసన్నమైందని ఆయన ఓ నోట్ ని సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు రివీల్ కావాల్సి ఉంది.