నిర్మాత డి.శివ‌ప్ర‌సాద్ రెడ్డి మృతి, నాగ్ కు తీరని లోటే

                                                        (సూర్యం)

ప్ర‌ముఖ నిర్మాత‌, కామాక్షి మూవీస్ అధినేత,నాగార్జునకు చిరకాల మిత్రుడు డి.శివ ప్ర‌సాద్ రెడ్డి(62) శనివారం ఉద‌యం ఆరున్న‌ర గంట‌ల‌కు క‌న్నుమూశారు. హార్ట్ కు సంభందించిన  స‌మ‌స్య‌తో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన  ఆయ‌నకు ఇటీవ‌లే ఓపెన్ హార్ట్ స‌ర్జ‌రీ జ‌రిగింది. కోలుకుంటున్నారు అనుకున్న సమయంలో  ఇలాంటి ఊహించని పరిణామం జరిగింది.

నిర్మాతగా మంచి సూపర్ హిట్స్ ని అందించారు. 1985లో కామాక్షి మూవీస్ బ్యాన‌ర్‌ను స్థాపించిన ఆయన  కార్తీక పౌర్ణ‌మి, శ్రావ‌ణ సంధ్య‌, విక్కీ దాదా, ముఠా మేస్త్రి, అల్ల‌రి అల్లుడు, ఆటోడ్రైవ‌ర్‌, సీతారామ‌రాజు, ఎదురులేని మ‌నిషి, నేనున్నాను, బాస్‌, కింగ్, కేడీ, ర‌గ‌డ‌, ద‌ఢ‌, గ్రీకువీరుడు
సినిమాల‌ను నిర్మించారు.

నాగార్జునతో ఆయన సన్నిహితంగా ఉండేవారు. నాగార్జునతోనే వరస సినిమాలు చేయటానికి ఇష్టపడేవారు. నాగ్ తో దాదాపు 30  ఏళ్ళ పరిచయం.  ఈ విషయమై ఆయన మాట్లాడుతూ… 1985లోనే “విక్రమ్” షూటింగ్‌కు ముందే నాగ్ నాకు తెలుసు. నేనప్పుడు శ్రావణ సంధ్య, కార్తీక పౌర్ణమి చిత్రాలు చేస్తున్నాను. ఆయనతో ఏర్పడిన పరిచయంతో “విక్కీదాదా” తీశాను. ఆ తర్వాత మిగిలిన హీరోలతో “ముఠామేస్త్రీ”, “అల్లరి అల్లుడు” చిత్రాలు తీశాను. నిర్మాతగా నా టార్గెట్ అంటూ ఏమీలేదు. ఇలాగే నాగ్‌తో చిత్రాలు చేయాలనుకుంటున్నాను అనేవారు. సినిమాలతో ఆయన దెబ్బ తిన్నప్పుడు నాగార్జున ఆర్దికంగా సాయం చేసాడని చెప్పుకుంటారు.

నాగ్ గురించి ఆయన చెప్తూ… దైవ నిర్ణయంతో నాగార్జునకు నాకు స్నేహం ఏర్పడిందనుకుంటా. మా కుటుంబ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు కలిసిపోతాం. మా అబ్బాయి నిఖిల్, నాగచైతన్య కూడా మంచి స్నేహితులు. ఇది ఫలానా కారణం అని ప్రత్యేకంగా చెప్పలేం. నా సినిమా అంటేనే.. స్వంత ప్రాజెక్టుగా ఫీలై అన్నీ ఆయనే చూసుకుంటారు. మా ఇద్దరి మధ్య ఎటువంటి క్లాష్ రాలేదు. నాగ్‌తో నిర్మాతగా గర్వపడుతుంటాను అనేవారు. నిజానికి శివప్రసాద్ రెడ్డి మరణం నాగార్జున కు తీరని లోటే. ఓ మంచి మిత్రుడుని కోల్పోయినట్లే.   డి.శివ ప్ర‌సాద్ రెడ్డి కు ఇద్ద‌రు కుమారులు. ఈయ‌న మృతి ప‌ట్ల తెలుగురాజ్యం  సంతాపాన్ని వ్య‌క్తం చేస్తోంది.