‘లింగుస్వామిపై నిర్మాత ఫిర్యాదు..’ రామ్ తో సినిమా పరిస్థితేంటో..?

రామ్‌ హీరోగా తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటివలే రామ్ కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నట్టు ట్వీట్ చేశాడు కూడా. అయితే.. ఇప్పుడు దర్శకుడు లింగుస్వామికి అనుకోని చిక్కులు వచ్చాయి. ప్రముఖ తమిళ నిర్మాత జ్ఞాన్‌వేల్‌ రాజా ఆయనపై తెలుగు నిర్మాతల మండలికి, తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌కు ఫిర్యాదు చేశారు. తన స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌లో లింగుస్వామి ఓ ప్రాజెక్ట్‌ తెరకెక్కించాల్సి ఉందని.. ఇందుకు భారీ అడ్వాన్స్ కూడా తీసుకున్నట్టు చెప్పారు.

‘ఇప్పటివరకూ మా బ్యానర్‌పై లింగుస్వామి ఎలాంటి సినిమానూ చేయలేదు. పైగా.. మాతో ప్రాజెక్ట్ పక్కనపెట్టేసి ఇప్పుడు రామ్‌తో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ఇది సరైంది కాదు. మాట ప్రకారం లింగుస్వామి ముందు మా బ్యానర్‌లో సినిమా చేయాలి. ఆ తర్వాతే కొత్త ప్రాజెక్టులోకి వెళ్లాలి. ఆయన రామ్‌తో సినిమా చేయడంపై మాకెలాంటి అభ్యంతరమూ లేదు’ అని జ్ఞాన్‌వేల్‌ వివరించారు.