ప్ర‌భాస్ కి ర‌ష్య‌న్ హార్ట్ అవార్డు..బాహుబ‌లి గెలుపుకే

బాహుబ‌లి చిత్రంతో ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అత‌ని క్రేజ్ స‌రిహ‌ద్దులు, ఖండాలు దాటి విశ్వ‌వ్యాప్త‌మైంది. ప్ర‌భాస్ అంటే ఇప్పుడు తెలియ‌ని ప్రేక్ష‌కుడు లేడు. చైనా, జ‌పాన్, సింగ‌పూర్, మ‌లేషియా లాంటి దేశాల్లోనూ ప్ర‌భాస్ కు ప్ర‌త్యేక‌మైన అభిమానులు ఏర్ప‌డ్డారు. తొలిసారి తెలుగు వాడి ట్యాలెంట్ ను విశ్వ వ్యాప్తం చేసిన సినిమాగా బాహుబ‌లి అవార్డులు..రివార్డులు అందుకుంది. ఆసియా ఖండంలోనూ అరుదైన అవార్డుల‌ను అందుకుని తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన చిత్రంగా బాహుబ‌లి రికార్డుకెక్కింది. జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో బాహుబ‌లి అవార్డుల పంట పండించింది. తాజాగా ర‌ష్యాలోనూ బాహుబ‌లి స‌త్తా చాటింది.

ఇటీవ‌లే చిత్రం ర‌ష్యా టీవీల్లో ప్ర‌సార‌మైంది. దీంతో చిత్రానికి బుల్లి తెర ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. దీంతో అక్క‌డి ప్ర‌భుత్వం ప్ర‌భాస్ ని `ర‌ష్య‌న్ ఆడియ‌న్స్ హార్ట్` అవార్డుకు ఎంపిక చేసింది. ఇది చాలా ప్రతిష్టాత్మ‌క‌మైన అవార్డు. చాలా అరుదుగానే ఇలాంటి అవార్డుతో అక్క‌డి ప్ర‌భుత్వం స‌త్క‌రిస్తుంటుంది. 30 ఏళ్ల కింద‌ట బాలీవుడ్ న‌టుడు రాజ్ క‌పూర్ ఈ అవార్డు అందుకున్నారు. అప్ప‌ట్లో రాజ్ క‌పూర్ న‌టించిన ఆవారా, ఆరాధాన లాంటి సినిమాలు అక్క‌డ టెలివిజ‌న్ లో ప్ర‌సారం అయి మంచి స‌క్సెస్ అయ్యాయి. ఈ నేప‌థ్యంలో ఆ సినిమాల‌ను ప్రేక్ష‌కులు మెచ్చ‌డంతో రాజ్ క‌పూర్ ర‌ష్య‌న్ అవార్డుతో స‌త్క‌రించారు.

మ‌ళ్లీ 30 ఏళ్ల త‌ర్వాత అదే వార్డుతో ప్ర‌భాస్ కి ప‌ట్టం క‌ట్ట‌డం విశేషం. ప్ర‌స్తుతం ఈవార్త దేశ వ్యాప్తంగా సంచ‌ల‌న‌మ‌వుతోంది. 30 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఓ భార‌తీయ న‌టుడుకి, అందులోనూ తొలిసారి ఓ తెలుగు న‌టుడికి ఇలాంటి గౌర‌వం ద‌క్క‌డం గొప్ప విశేషం .మ‌రి ఈ అవార్డు ప్ర‌దానోత్స‌వం ఎప్పుడు ఉంటుంది త‌దిత‌ర వివారాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ అవార్డు రాక‌తో స్ర్కీన్ బాహుబ‌లి ప్ర‌భాస్ ఆనందానికి అవ‌దుల్లేవ్. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో జాన్ లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.