ప్రభాస్ చుట్టూ నెగ‌టివ్ ఎన్విరాన్‌మెంట్‌…

ఓ సినిమాను మొద‌లుపెట్ట‌డం అంటే ఆషామాషీ కాదు. క‌థ‌, నిర్మాత‌, హీరో ఎన్నో కుద‌రాలి. అన్నీ కుదిరిన త‌ర్వాత అనుకున్న క‌థ‌ను స‌క్ర‌మంగా తెర‌పైకి ఎక్కించాలి. ఈ క్ర‌మంలో జ‌రిగే ప్రాసెసే ఆర్టిస్ట్ సెల‌క్ష‌న్‌. అస‌లే సెంటిమెంట్ల‌ను గురించి తెగ ఆలోచించే సినిమా ఇండ‌స్ట్రీలో ఈ ప్రాసెస్ చాలా ప‌గ‌డ్బంధీగా సాగుతుంది. అయితే యువీక్రియేష‌న్స్ మాత్రం ఈ విష‌యంలో  ఈ సారి లైట్ తీసుకున్న‌ట్టు అనిపిస్తోంది. యువీలో ప్ర‌స్తుతం వ‌రుస‌గా సినిమాలున్నాయి.. ఇంత‌కీ ఏ సినిమా గురించి ఈ ఉపోద్ఘాత‌మంతా? అనేగా మీ అనుమానం.. అక్క‌డికే వ‌స్తున్నాం. ఇక్క‌డ చెబుతున్న‌ది సాహో గురించి. ఇందులో ప్ర‌భాస్ క‌థానాయ‌కుడు. యువీలోనే తొలి సినిమా చేసిన సుజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బాలీవుడ్ నుంచి శ్ర‌ద్ధాను దింపారు. సౌత్‌లో ఆమెకు చాలా మంది అభిమానులున్నార‌ని చెప్పి మాట‌ల‌తో వ‌లేశారు. 

 

ఇదంతా ఒక ఎత్తు.. ఈ సినిమా కాస్టింగ్ మ‌రో ఎత్తు. మ‌రీ ముఖ్యంగా జాకీష్రాఫ్‌, లాల్‌, అరుణ్ విజ‌య్‌… ఈ పేర్ల‌ను బ‌య‌టి నుంచి వింటే బాగానే ఉంటుంది. కానీ స్ట్రెయిట్ తెలుగు సినిమాలో వీళ్ల పేర్లు విన్న వాళ్లెవ‌రూ అంత ఇష్టంగా ముఖం పెట్ట‌రు. ఎందుకంటే జాకీ ష్రాఫ్ న‌టించిన `అస్త్రం`, `పంజా`, `శ‌క్తి` ఫ‌లితాలు మ‌న‌కు తెలిసిన‌వే. అలాగే మ‌ల‌యాళ న‌టుడు లాల్ న‌టించిన ర‌వితేజ `ఖ‌త‌ర్నాక్‌` ప‌రిస్థితిని ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అలాంటి మ‌రో సినిమానే రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన `బ్రూస్‌లీ`. ఇందులో అరుణ్ విజ‌య్ న‌టించాడు. సో ఈ ముగ్గురికి స్ట్రెయిట్‌గా తెలుగులో నిఖార్స‌యిన హిట్ లేద‌న్న‌మాట‌. ఎ.ఆర్‌.రెహ‌మాన్ స్ట్రెయిట్ సినిమాకు సంగీతం అందిస్తే అభిమానుల్లో ఎలాంటి టెన్ష‌న్ అయ‌తే ఉంటుందో.. మ‌ణిశ‌ర్మ ఆడియో వేడుక‌కు, మ‌హేష్ ముహూర్త‌పు వేడుక‌కు వ‌స్తే సెంటిమెంట్‌గా ఎలా వ‌ర్క‌వుట్ కావ‌ని భావిస్తారో.. ఇప్పుడు ఈ ముగ్గురి పేర్ల‌ను ఫ్యాన్స్ అంత‌లా వ‌ల్లె వేస్తున్నారు. ఒక్క `గ‌బ్బ‌ర్‌సింగ్` శ్రుతిహాస‌న్‌కి హిట్ ఇచ్చి గ‌ట్టున ప‌డేసిన‌ట్టు… ఈ ముగ్గురికీ `సాహో` మంచి సినిమా కావాల‌ని ఆశిద్దాం.