‘మిస్టర్ ఫర్ ఫెక్ట్’ కథ కాపీనే, కోర్ట్ తీర్పు

‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ (2011) కాపీ వివాదం కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. 2019 జనవరిలో కోర్టు ఆదేశాల మేరకు 4117/ 2018 గా చార్జిషీట్ నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు దిల్ రాజుకు సమన్లు పంపించారు. అప్పటి నుండి కోర్టులో నలుగుతున్న కాపీ వ్యవహారం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. రచయిత్రి శ్యామలారాణి నవల ‘నా మనసు నిన్ను కోరె’ కథ, ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ సినిమా కథ ఒకేలా ఉన్నాయని హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు పేర్కొంది.

వివరాల్లోకి వెళితే… 2017 సెప్టెంబరులో శ్యామల తన కథను దొంగలించి ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ (2011) సినిమా తీశారని కేసు నమోదు చేశారు. ఈ మేరకు పోలీసులు కాపీరైట్‌ చట్టం కింద నిర్మాత దిల్‌రాజుపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ కథ, ‘నా మనసు నిన్ను కోరె’ కథ దాదాపు ఒకేలా ఉన్నాయని హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు నిర్ధారించినట్లు తెలిసింది. ఈ కేసు విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకోమని కోర్టు పోలీసు శాఖను ఆదేశించిందని సమాచారం.

రచయిత్రి శ్యామల మాట్లాడుతూ.. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా 2011లో విడుదలైనా.. తాను అమెరికాలో ఉండటం వల్ల 2013లో టీవీలో చూశానని అప్పటి వరకూ తనకు ఈ సినిమా కాపీ కొట్టారనే విషయం తెలియదన్నారు. ఈ చిత్రంలో ప్రతి పాత్ర నేను రాసిన నవల నుండి కాపీ కొట్టిందే. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత దిల్ రాజుకి తెలియజేయడానికి ప్రయత్నించినా ఆయన ఆపాయింట్ మెంట్ ఇవ్వలేదు. పైగా ఈ కథను 2009లోనే రిజిస్టర్ చేసినట్టు తప్పుడు ఆధారాలు చూపించారని వాపోయారు శ్యామలాదేవి. మిస్టర్ పర్ఫెక్ట్ కథను నా పర్మిషన్ లేకుండా కాపీ చేసి సొమ్ము చేసుకున్నారు. ఈ కథ రాయడానికి నాకు సంవత్సరం పట్టింది. సినిమా చూసిన తరువాత 30 సీన్లకు పైగా మక్కీకి మక్కీ దించేశారు. అన్ని భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేశారు. నాకు జరిగిన నష్టానికి నష్టపరిహారం ఖచ్చితంగా అడుగుతా’ అన్నారు శ్యామలాదేవి.

‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ దర్శకుడు దశరథ్‌ మాట్లాడుతూ.. ‘శ్యామలా రాణి నవల 2010 ఆగస్టులో పబ్లిష్‌ అయ్యింది. కానీ నేను ఈ సినిమా కథను 2009 ఫిబ్రవరిలో ‘నవ్వుతో’ అనే టైటిల్‌తో సినీ రచయిత సంఘంలో నమోదు చేయించా. నేను దీనికి సంబంధించిన పత్రాన్ని కూడా కోర్టుకు సమర్పించా. 2008లో ప్రభాస్‌ ‘బిల్లా’ సినిమా షూటింగ్‌ నిమిత్తం మలేషియాలో ఉన్నప్పుడు నేను, దిల్‌రాజు కలిసి వెళ్లి ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ కథను నరేట్‌ చేశాం. ఆ సినిమా కథ కాఫీ కొట్టింది అనడంలో నిజం లేదు. నా కథ ఆమె నవల కన్నా ముందే ఉంది’ అని ఆయన అన్నారు.