రిలీజ్ తేదీ : జూలై 25, 2020
రేటింగ్ : 2.0/5
నటీనటులు : ప్రవన్ కళ్యాణ్
దర్శకత్వం : ఆర్జీవీ
సంగీతం : డి.ఎస్.ఆర్
కెమెరా : జోషి
ముందుమాట:
గత కొంతకాలంగా జనసేనాని పవన్ కల్యాణ్ రాజకీయ వైఫల్యంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ `పవర్ స్టార్` సినిమాని తీస్తున్నారన్న వార్తలు వేడెక్కించాయి. ఇటు సినీవర్గాలు సహా రాజకీయ వర్గాల్లో.. పవన్ అభిమానుల్లో విస్త్రతంగా చర్చ సాగింది. తన ప్రత్యర్థి అయిన పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఆర్జీవీ తీసిన సినిమా ఇది. పైగా ఆర్జీవీ వరల్డ్ థియేటర్ అనే ఏటీటీ వేదికపై ఈ మూవీ నేడు రిలీజైంది. పోస్టర్లు.. టీజర్.. ట్రైలర్ అంటూ ఆర్జీవీ ఎంతో హడావుడి చేశాడు. ట్రైలర్ తో వివాదాలు పీక్స్ కి చేరుకుని ప్రచారం దండీగా జరిగింది. అయితే హడావుడికి తగ్గట్టు అంత మ్యాటర్ ఈ మూవీలో ఏం ఉంది? అని ప్రశ్నిస్తే .. సమీక్షలోకి వెళ్లాల్సిందే.
కథ కమామీషు:
గత సార్వత్రిక ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన జనసేనాని ప్రవన్ కల్యాణ్ (పవన్ పాత్రధారి) ఇరు సీట్లలోనూ ఓటమి పాలవుతారు. ఆ తర్వాత రాజకీయ భవితవ్యంపై ఆయనలో అంతర్మథనం ఎలా సాగింది? తనని కలిసిన నాదెండ్ల మనోహర్.. త్రివిక్రమ్ .. చిరంజీవి.. చంద్రబాబు.. వంటి వారితో అతడు ఎలా ప్రవర్తించాడు? సినిమా తీస్తానని తన వద్దకు వచ్చిన బండ్ల గణేష్ తో కామెడీలు ఏమిటి? కత్తి మహేష్ ఎపిసోడ్ ఏమిటి? అన్నది ఈ సినిమా. అన్నట్టు చివరిలో ప్రవన్ ని ఓదార్చేందుకు భగవద్ గీతను బోధించేందుకు ప్రవన్ వద్దకు వచ్చిన షాడో మేన్ ఎవరు? అన్నదే ఈ మూవీలో అసలు సిసలు సస్పెన్స్ ఎలిమెంట్.
ఆర్జీవీ ముందే చెప్పినట్టే ఇది కేవలం ఏటీటీ సినిమా. ఒక సినిమాకి ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా లేని నాశిరకం సినిమా. పవన్ జీవితంలో ఎమోషనల్ ఘట్టాన్ని తీసుకుని ఆయన చుట్టూ ఉన్న క్యారెక్టర్లతో కామెడీలు చేయిస్తూ పవన్ పై సెటైర్ వేసే ప్రయత్నం చేశారు ఆర్జీవీ. కొన్ని పంచ్ డైలాగులు.. వ్యంగ్యాన్ని మేళవించి ఒకదాని వెంట ఒకటిగా మలిచిన సన్నివేశాల సమాహారంగా సాగుతుంది. ఓటమి పాలై ఒత్తిడిలో ఉన్న పవన్ తిరిగి రాజకీయాల్లో కొనసాగాలా వద్దా? అన్న సందిగ్ధ సమయంలో చిరంజీవి నేరుగా పవన్ ఫామ్ హైస్ లోకి ప్రవేశించి ఎమోషన్ కి గురవ్వడం.. తనకంటే తమ్ముడికి ఏం తెలుసని ప్రశ్నించడం.. అసలు రాజకీయాలే వద్దని చెప్పడం వగైరా సీన్లు చిరు- పవన్ జోడీపై సెటైరికల్. చంద్రబాబు ఎపిసోడ్ లో ఆర్జీవీ కామెడీ మామూలుగా లేదు. అయితే పాత్రదారులందరినీ బఫూన్లను చేయాలన్న ఆర్జీవీ సంకల్పమేమిటో ఎవరికీ అర్థం కాదు.
ప్లస్ పాయింట్స్:
* ప్రవణ్ కల్యాణ్ పాత్రధారి నటన
* పాత్రల వేషాలు.. సెటైరికల్ పంథా
* చంద్రబాబు పాత్ర సంవిధానం
మైనస్ పాయింట్స్ :
* నాశిరకం వోడ్కా గీతోపదేశం
* పాత్రల్ని కావాలని నెగెటివ్ గా చూపించడం
* సూటిగా నొప్పించిన విధానం
చివరిగా :
ట్రైలర్ చూశాక ఆర్జీవీ ఇంకేదో చూపించేస్తాడు! అనుకుంటారు. కానీ అదేదీ లేదు సినిమాలో. కేవలం సీన్ తర్వాత సీన్ లా పవన్ ఎమోషనల్ ఎపిసోడ్స్ ని 35 నిమిషాల్లో చూపించారు. డిగ్నిఫైడ్ పర్సనాలిటీస్ పై ఇలా సెటైర్లు వేయడం ఆర్జీవీకి ఎంతవరకూ తగునో! పవన్ గొప్పవాడని కానీ చుట్టూ ఉన్నవాళ్లే తప్పుదారి పట్టించారని అందరినీ ఎగతాళి చేశారు ఆర్జీవీ. అది సెటైరికల్ గా ఉంటే బావుండేది.. కానీ ఎగతాళిగా అనిపించడం మైనస్. టెక్నికల్ గా మూవీ ఓకే. బడ్జెట్లతో పనిలేని నాశిరకం ఏటీటీ సినిమా ఇది.
ముగింపు:
పవర్ స్టార్ .. ఆర్జీవీ పైత్యం పీక్స్
రేటింగ్:
2.0/5