ప‌వ‌ర్ స్టార్ (Vs)  ప‌రాన్న‌జీవి.. ఎవ‌రు  హిట్టు?

ఓటీటీకి పోటీగా ఏటీటీ అంటూ బోలెడంత ర‌చ్చ సాగుతోంది. అస‌లు ఏటీటీ అంటే ఏమిటి? అన్న‌ది ఇంకా ఎవ‌రికీ అర్థం కాలేదు. ఈలోగానే ఈ వేదిక‌ల‌పై ఓ రెండు సినిమాలు రిలీజై రిజ‌ల్ట్ కూడా వ‌చ్చేసింది. జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ పొలిటిక‌ల్ వైఫ‌ల్యంపై ఆర్జీవీ మూవీ `ప‌వ‌ర్ స్టార్` .. రామ్ గోపాల్ వ‌ర్మ‌ను టార్గెట్ చేస్తూ ష‌క‌ల‌క శంక‌ర్ టైటిల్ పాత్ర‌లో నూత‌న్ నాయుడు తెర‌కెక్కించిన ప‌రాన్న‌జీవి ఒకేరోజు (జూలై 25)న రిలీజ‌య్యాయి. ఈ రెండు సినిమాల్లో ప‌వ‌ర్ స్టార్ సినిమాకి హైప్ వ‌చ్చింది. ఆర్జీవీ వివాదాల‌తో ఈ మూవీకి కావాల్సినంత ప్ర‌చారం తెచ్చి పెట్టారు.

ఫ‌లితంగా మొద‌టి రోజు జ‌నం బాగానే ఈ మూవీని వీక్షించార‌ట‌. దాదాపు 2కోట్ల రాబ‌డి వ‌చ్చింద‌ని చెబుతున్నారు. అస‌లు ఏమాత్రం పెట్టుబ‌డి లేకుండా నాశిర‌కం విజువ‌ల్స్ తో తీసిన ఈ మూవీకి పెట్టుబ‌డి కేవ‌లం ల‌క్ష‌ల్లోనే ఉంటుంది. అంటే ల‌క్ష‌ల్లో లాభాలు వ‌చ్చాయ‌ని విశ్లేషిస్తున్నారు. అయితే ఈ మూవీని కేవ‌లం ఒక‌రోజే ఏటీటీలో చూశారు. ఆ త‌ర్వాత పైర‌సీ వీడియోలో చూశారు జ‌నం. రిలీజ్ రోజునే పైర‌సీలో మొత్తం సినిమా రిలీజైపోయింది. దీంతో క‌లెక్ష‌న్ల‌కు బిగ్ పంచ్ ప‌డిపోయింద‌ట‌. అయితే ఆర్జీవీ భారీ పెట్టుబ‌డులు పెట్టి తీసిన పూర్తి నిడివి సినిమా కాదు ఇది. కొన్ని స‌న్నివేశాల స‌మాహారంగా తీసిన ల‌ఘు చిత్రం లాంటిది ఇది. అందుకే న‌ష్టాలేవీ లేవ‌ట‌.

ప‌రాన్న‌జీవి రిజ‌ల్ట్ మాటేమిటి? అంటే.. ఈ మూవీ దుస్థితి చాలా దయనీయంగా ఉంది. 10 వేల‌ టిక్కెట్లు అమ్ముడయ్యాయని అయితే 5000 మందికి పైగా అస‌లు టిక్కెట్లు కొనుగోలు చేసి చూడలేదని తెలుస్తోంది.
టికెట్ ధరను రూ .100 అనుకుంటే ఈ చిత్రం సుమారు 5 -10 లక్షలు వసూలు చేసి ఉంటుద‌ని అంచ‌నా. అంతేకాదు.. ర‌క‌ర‌కాల సాంకేతిక కార‌ణాల‌తో రిలీజ్ రోజు సాయంత్ర‌మే ప‌రాన్న‌జీవి మూవీ లింక్ ఓపెన్ కాక‌పోవ‌డం పెద్ద దెబ్బ కొట్టింది. దీంతో జ‌నంలో ఈ మూవీని చూడాల‌న్న ఆస‌క్తి చ‌చ్చింద‌ట‌.