సినీ పరిశ్రమను విషాదం వెంటాడుతూనే ఉంది. బెంగాలీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి పాయల్ చక్రవర్తి ఓ హోటల్ లో ఆత్మహత్య చేసుకుంది. గ్యాంగ్ టక్ వెళ్లేందుకు మంగళవారం సిలిగురి వచ్చి ఓ హోటల్ రూమ్ ను పాయల్ బుక్ చేసుకుంది. తనను ఎవరూ డిస్టర్బ్ చేయవద్దని హోటల్ సిబ్బందికి ముందే చెప్పింది. మంగళవారం రాత్రి భోజనం కూడా చేయలేదు. అయితే, బుధవారం ఉదయాన్న ఆమె బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది ఆమె గది తలుపు తట్టారు.
ఎంత సేపటకి లోపలి నుంచి స్పందన రాకపోవడంతో తలుపులు బద్దలు గొట్టి లోపలికి వెళ్లిన సిబ్బంది అక్కడి దృశ్యాన్ని చూసి షాకయ్యారు. ఫ్యాన్ కు వేలాడుతూ పాయల్ కనిపించింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పాయల్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు నిర్దారించారు. అయితే పోస్టుమార్టం తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. పాయల్ ఆత్మహత్య విషయం తెలిసి చిత్రపరిశ్రమ దిగ్బ్రాంతి చెందింది. ఇటీవల భర్త నుంచి విడాకులు తీసుకున్న పాయల్ తీవ్ర ఒతిడిలో ఉన్నట్టు తెలుస్తోంది. కుమారుడితో కలిసి పాయల్ తల్లిదండ్రుల వద్ద ఉంటోంది.