సినీనటి భానుప్రియ తన కుమార్తెను నిర్బంధించిందని సామర్లకోట పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయటం సంచలనంగా మారింది. పధ్నాలుగేళ్ల తన కూతురు సంధ్యను ఇంట్లో పనికి కుదుర్చుకున్న భానుప్రియ తన ఇంటికి పంపించడం లేదని సామర్లకోట పండ్రవాడకు చెందిన ప్రభావతి ఆరోపిస్తోంది.
వివరాల్లోకి వెళితే..సామర్లకోట మండలం పండ్రవాడకు చెందిన ప్రభావతి అనే నిరుపేద మహిళ, ఆర్ధిక పరిస్థితులు బాగోలేని కారణంగా తాను ఇళ్లలో పనిచేసుకుని బతుకుతోంది. అదే క్రమంలో తెలిసున్న వారి ద్వారా ఏడాది క్రితం తన కూతురు సంధ్యను కూడ భానుప్రియ వద్ద పనికి పెట్టింది. మొదట్లో తన కుమార్తెని తరచుగా ఇంటికి పంపుతూ, ఫోన్ లో మాట్లాడిస్తూ బాగానే ఉండేవారు. కానీ ఇప్పుడు తన కుమార్తెని వేధిస్తున్నారు అంటూ ప్రభావతి వాపోయింది.
భానుప్రియ సోదరుడు తన కుమర్తె పట్ల నీచంగా ప్రవర్తిస్తున్నాడని సంచలన విషయాన్ని బయట పెట్టింది. అతడు తరచుగా తన కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడని అన్నారామె. తన కుమార్తెని ఇంటికి పంపండి అని ప్రాధేయపడినా అంగీకరించడం లేదు. పైగా దొంగతనం కేసులు పెడతాం అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని భాదితురాలి తల్లి పేర్కొంది. దాంతో ప్రభావతి ఛైల్డ్‌లైన్ 1098 సహాయం కోరింది. దీంతో.. ఛైల్డ్‌లైన్ ప్రతినిధులు భానుప్రియపై పోలీసులకు ఫిర్యాదు ఛేశారు.
ఆర్థిక పరిస్థితి బాగాలేక, చుట్టుపక్కల వాళ్ళ సలహాతోనే ఈ పని చేశానని ప్రభావతి తెలిపింది. తన కుమార్తెకు ప్రస్తుతం 14ఏళ్ల వయసు అని ఆమె వివరించింది.