పవన్ కుటుంబానికున్న క్రమశిక్షణ ఏపాటిదో తేలిపోయింది 

power star
పవన్ కళ్యాణ్ మీద తిట్ల దండకం అందుకుంటే పబ్లిసిటీ వస్తుంది, అయన అభిమానుల్ని రెచ్చగొడితే అందరి దృష్టిలో పడొచ్చు, మెగా ఫ్యామిలీ మీద ఎన్ని కారుకూతలు కూసినా ప్రమాదమేమీ ఉండదు, పవన్ వ్యక్తిగత జీవితంలో వేలు పెడితే టీవీ ఛానెళ్ళ కవరేజ్ దొరికేస్తుంది.. ఇవి గత కొన్నేళ్లుగా కొందరు లైమ్ లైట్లో ఉండటం కోసం నమ్ముకున్న పనికిమాలిన స్ట్రాటజీలు.  దురదృష్టవశాత్తు టిఆర్పీల్ కోసం కక్కుర్తిపడే టీవీ ఛానెళ్ళకు కొదవలేకపోవడంతో ఆ స్ట్రాటజీలు వర్కవుట్ అయ్యాయి కూడ.  అందుకు ఉదాహరణే కత్తి మహేష్, శ్రీరెడ్డి, రాంగోపాల్ వర్మ, మేధావులమని చెప్పుకునే కొందరు సినీ పర్సనాలిటీలు.  వీరికి పవన్ కళ్యాణ్ కు నేరుగా ఎలాంటి వివాదాలు ఉండవు.  మెగా కుటుంబంతో వీరికి అసలు పరిచయమే ఉండదు.  కానీ తమ సమస్యలకు మూల కారణం మాత్రం మెగా పవన్, మెగా ఫ్యామిలీ అన్నట్టే ఏడుస్తుంటారు.  
 
అలా ఏడ్చి ఏడ్చి వీరిలో కొందరు పొందాల్సిన ప్రయోజనాన్ని పొందారు.  ఈ తరహా వికృత చేష్టలకు వేరో హీరోలు, నాయకులు, కుటుంబాలు అయితే మానసిక క్షోభకు గురై కోర్టుల వరకు వెళ్లేవారేమో కానీ పవన్ కుటుంబం మాత్రం అన్నిటినీ తట్టుకుని నిబ్బరంగా నిలబడింది.  అందుకు కారణం ఆ కుటుంబానికున్న క్రమశిక్షణ.  మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ నుండి నిన్న మొన్న సినిమాల్లోకి వచ్చిన మెగా హీరోలందరూ ఒక్క మాట మీద నిలబడి మొరిగిన వారందరికీ మౌనంతోనే బుద్ది చెప్పారు.  అందుకు ఉదాహరణే తాజాగా వర్మ సృష్టించిన ‘పవర్ స్టార్’ సినిమా వివాదం. 
 
దాదాపు నెల రోజులు ఈ సినిమా పేరుతో పవన్ మీద సామాజిక మాధ్యమాల్లో దాడి జరిగింది.  ఆయన వ్యక్తిత్వాన్ని, రాజకీయ లక్ష్యాలను, వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబాన్ని అల్లరిపాలు చేసే ప్రయత్నం జరిగింది.  వర్మ ఏ ఉద్దేశ్యంతో ఈ సినిమా చేశాడో కానీ ప్రత్యర్థులు మాత్రం ఈ సినిమాను పవన్ మీద బురద చల్లడానికి బాగా వాడుకున్నారు.  అభిమానుల్ని రెచ్చగొట్టి వేడుక చూద్దామని ఆశపడ్డారు.  మెగా హీరోలు తిరగబడకపోతారా, గొడవ పెద్దది కాకపోతుందా అని కళ్లల్లో ఒత్తులేసుకుని చూశారు.  ఇక పవన్ వ్యతిరేక మీడియా అయితే వివాదాన్ని లేపుతూ మెగా హీరోలు స్పందిస్తే డిబేట్లు పెట్టడానికి సిద్దమయ్యారు.  కానీ అవేవీ కుదరలేదు. 
 
ఇంత గొడవ జరుగుతున్నా పవన్ కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఒక్క మాట మాట్లాడలేదు.  వాళ్ళకీ తెలుసు ఆవేశపడి బయటికొస్తే బద్నాం చేయడానికి చాలా శక్తులు కాచుకుని కూర్చున్నాయని.  అందుకే పట్టించుకోవడం మానేశారు.  అభిమానులకు, జనసేన కార్యకర్తలకు కూడ అవే సంకేతాలిచ్చారు.  ఒకానొక దశలో పవన్ మీద వర్మ విరుచుకుపడుతుంటే మెగా హీరోలు పట్టించుకోవట్లేదని, అందుకు కారణం కుటుంబ కలహాలేననే తప్పుడు ప్రచారం కూడా చేశారు.  కానీ అవేవీ మెగా ఫ్యామిలీ క్రమశిక్షణకు భంగం కలిగించలేకపోయాయి.  చివరికి చిలువలు పలువలు మాట్లాడిన వారంతా నిన్న సినిమా విడుదలై అందులో మేటర్ లేదని తెలుసుకుని తలలు దించేసుకున్నారు.  ఇలాంటి రచ్చలతో మెగా కుటుంబాన్ని డిస్టర్బ్ చేయలేమని గ్రహించి తోకలు ముడిచారు.  అంతిమంగా ఈ వివాదాంతో పవన్ ఫ్యామిలీకి ఒక హుందాతనం, ఎవ్వరూ బ్రేక్ చేయలేని క్రమశిక్షణ ఉన్నాయని రుజువుకాబడింది.