పెట్టుబడులు రావడం అంత సులువా?
అవిభాజిత ఆంధ్ర ప్రదేశ్ రాజధాని నగరం హైదరాబాద్ లో అరడజను ఫిలింస్టూడియోలు ఉన్న సంగతి తెలిసిందే. రామానాయుడు స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియో, రామకృష్ణ స్టూడియోస్, పద్మాలయ స్టూడియోస్, సారథి స్టూడియోస్, శబ్ధాలయా స్టూడియోస్ .. ఇలా ప్రముఖ స్టూడియోలన్నీ హైదరాబాద్ లోనే ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత సువిశాలమైన బీచ్ లు ఉన్న సుందర నగరంగా పేరున్న విశాఖపట్నంలో ఫిలింస్టూడియోలు నిర్మిస్తారని ప్రచారమైంది. కానీ అక్కడ ఒక్క రామానాయుడు స్టూడియో మినహా వేరే స్టూడియోలేవీ నిర్మించలేదు.
అయితే ఇప్పుడు ఏపీలోనే రూ.500 కోట్లతో ఫిలింస్టూడియో నిర్మించేందుకు సినీరచయిత కోన వెంకట్ ప్రయత్నాలు చేయడం ఆసక్తిని రేపుతోంది. గుంటూరు సూర్యలంకలో ఈ స్టూడియోని ..దీంతో పాటే థీమ్ పార్క్ ప్లాన్ చేస్తున్నామని ఆయన తెలిపారు. అందుకోసం ఓ ప్రముఖ అంతర్జాతీయ కార్పొరెట్ సంస్థతో కలిసి ప్లాన్ అమల్లో ఉంటుందని బాపట్లలో జరిగిన ఓ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఏపీ పర్యాటక శాఖ సాయం ఉంటుందని వెల్లడించారు. అధికారులతో మాట్లాడి సూర్యలంకలో అందుకు సర్వేలు చేస్తున్నామని అన్నారు. కోన వెంకట్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి అభిమాని అన్న సంగతి తెలిసిందే.అయితే కోన ప్లాన్ ఎంతవరకూ వర్కవుటవుతుంది? పెట్టుబడులకు ముందుకొస్తున్న ఆ అంతర్జాతీయ సంస్థ ఏది? ఏపీ ప‌్రభుత్వం ఎంతవరకూ సానుకూలంగా ఉంది? అన్నది తెలియాల్సి ఉంది. అనుష్క కథానాయికగా `నిశ్శబ్ధం` చిత్రాన్ని పీపుల్ మీడియాతో కలిసి కోన నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.