ప్రముఖ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యన్.టి.ఆర్’. నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రానికి …. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్బీకే ఫిల్మ్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాను వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్నాయి.
ఈ సినిమా ట్రైలర్‌ను డిసెంబరు 16న హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న పోగ్రామ్ లో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. డిసెంబరు 21న నిమ్మకూరులో ఆడియో విడుదల వేడుకను ఘనంగా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.
ఇక ఈ బయోపిక్‌ను రెండు భాగాలుగా తీర్చిదిద్దుతున్నారు. ఎన్టీఆర్ బాల్యం నుంచి రాజకీయ రంగ ప్రవేశం వరకూ ‘కథానాయకుడు’గా రాబోతోంది. అక్కడి నుంచి అంతిమ ఘడియల వరకూ ‘మహానాయకుడు’లో చూపించబోతున్నారు. మొదటి భాగాన్ని వచ్చే ఏడాది జనవరి 9న, రెండో భాగాన్ని జనవరి 24న విడుదల చేయనున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఎన్టీఆర్ సతీమణి బసవతారకంగా విద్యా బాలన్, నారా చంద్రబాబు నాయుడుగా రానా, హరికృష్ణగా కల్యాణ్‌రామ్, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్, జయప్రదగా హన్సిక, జయసుధగా పాయల్ రాజ్‌పుత్, శ్రీదేవిగా రకుల్‌ప్రీత్ సింగ్, సావిత్రిగా నిత్యా మేనన్, ప్రభగా శ్రియ కనిపించనున్నారు. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.