‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ప్రెస్ మీట్ : ఎన్టీఆర్ ఏం మాట్లాడారంటే..

ఎన్టీఆర్,మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణాలు వచ్చేసాయి.‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ (వర్కింగ్‌ టైటిల్‌)కు సంబంధించిన వివరాలను ఎట్టకేలకు ఎస్‌.ఎస్‌ రాజమౌళి గురువారం ప్రెస్‌మీట్‌ పెట్టి వెల్లడించారు. ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యంగ్ టైగర్‌ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ల, నిర్మాత దానయ్య కూడా హాజరయ్యారు. ఈ చిత్రానికి సంబంధించిన విషయాలను వారు వివరించారు. ఎన్టీఆర్ ఈ ప్రెస్ మీట్ లో ఏమన్నారో చూద్దాం.

ఎన్టీఆర్ మాట్లాడుతూ…‘‘ఈరోజు చాలా టెన్షన్‌గా ఉంది. ఇది జక్కన్నతో నాలుగో చిత్రం నాది. అన్నింటికంటే ఈ సినిమా చాలా ప్రత్యేకంగా ఫీలవుతున్నాను. నా కెరీర్‌లో ల్యాండ్‌మార్క్‌గా మిగిలిపోతుంది, ఎందుకంటే జక్కన్నతో పనిచేయడం దాంతో పాటు చరణ్‌తో కలిసి తెరపంచుకోబోతున్నాను. మా ఇద్దరి స్నేహం ఈ సినిమాతో మొదలవ్వలేదు. నాకు తెలిసిన మంచి మిత్రుడు. నా కష్ట సుఖాలు పంచుకునే మిత్రుడు చరణ్‌. ఈ సినిమా మేం కలిసి చేసేసరికి వేరే లెవల్‌కు వెళ్లిపోయింది మా స్నేహం. మేమిద్దరం ఎప్పటికీ ఇలాగే స్నేహితులుగా మిగిలిపోవాలని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నాను. మాకు ఎలాంటి దిష్టి తగలకూడదు. అల్లూరి, భీం గురించి తెలిసిన గీత ఒకటి ఉంది.

ఇప్పుడు వారిద్దరూ మనకు తెలీని గీత గురించి ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’లో చూస్తారు. ఈ సినిమా నాకు, చరణ్‌కు నటులుగా ఎదగడానికి ఎంతో దోహదపడుతుంది. ఈ సినిమా ప్రారంభించడానికి ముందు మేం చేసిన వర్క్‌ షాప్స్‌, శిక్షణ చాలా అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు చేసిన 28 సినిమాల కంటే ఈ సినిమా కోసం తీసుకున్న శిక్షణ మా భవిష్యత్‌ సినిమాలకు ఎంతో సహాయపడుతుందని చెప్పగలను. మేం తీసుకున్న శిక్షణ వర్ణనాతీతం. రాజమౌళి బుర్రలో పుట్టిన ఈ ఆలోచన ఓ గొప్ప చిత్రంగా ఉంటుందని నా ప్రగాఢ విశ్వాసం. నటులుగా ఈ చిత్రంలో మేం పాల్గొనడం మా అదృష్టం. ఈ అవకాశం ఇచ్చినందుకు జక్కన్నకు ధన్యవాదాలు.

ఈ సినిమాలో ఆయన అడిగిన వెంటనే నాతో ఏకీభవించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఎటువంటి విభేదాలూ లేకుండా చరణ్‌ ఒప్పుకొన్నందుకు హ్యట్సాఫ్‌ చెప్పాలి. మా తరంలో ఈ సినిమా రాబోతోందని చాలా సంతోషంగా ఉంది. అది కేవలం జక్కన్నపై మాకున్న కాన్ఫిడెన్స్‌ వల్లే అవబోతోంది’’ అన్నారు.