ఎన్టీఆర్, రామ్ చరణ్ లపై ప్రశ్నల వర్షానికి ప్రిపరేషన్

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి అఫీషియల్ గా అప్ డేట్స్ లేవు. దాంతో పూటకో రూమర్…రోజుకో వార్త అన్నట్లుగా మీడియా వండి వడ్డించేస్తోంది. ఇవన్ని గమనించిన రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన వివరాలను వెల్లడించడానికి ప్రెస్ మీట్ ను నిర్వహించాలనుకుంటున్నారు. తాజాగా ఈ ప్రెస్ మీట్ కు సంబధించి చిత్ర యూనిట్ ఒక అప్ డేట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

హైదరాబాద్ లోని పార్క్ హైయేత్ హోటల్ లో మార్చి 14వ తేదీన ఈ ప్రెస్ మీట్ జరగనుందని పేర్కొంది. కాగా ఈ ప్రెస్ మీట్ కు చిత్ర యూనిట్ లోని కీలక సభ్యులతో పాటు ఎన్టీఆర్ – రామ్ చరణ్ కూడా హాజరవుతున్నారు. మరి ఈ ప్రెస్ మీట్ లో రాజమౌళి ఏం చెప్తారో ఏ విషయాలను రివీల్ చేస్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మీడియా వాళ్లు అయితే ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లను ఏం ప్రశ్నలు అడగాలి, రాజమౌళిని సినిమా గురించి ఎలాంటి కూపి లాగాలనే విషయంపై కసరత్తు చేస్తున్నారు. 

ఇక జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా రావడంతో.. ఫ్యాన్స్ లో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సిక్స్ ప్యాక్ తో కనువిందు చేయనున్నారు. రామ్ చరణ్ కూడా కొత్త హెయిర్ స్టైల్ తో కనిపిస్తారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.