నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘యన్.టి.ఆర్’. ఈ చిత్రం ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’ టైటిల్స్‌తో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ‘కథానాయకా..’ అనే పాటకు మంచి రెస్పాన్స్ లభిస్తున్న నేపధ్యంలో… ఈ చిత్రంలోని ‘రాజర్షి..’ అనే రెండో పాటను చిత్ర యూనిట్ ఈరోజు విడుదల చేసింది. ‘తల్లి ఏదీ? తండ్రి ఏడీ? అడ్డుతగిలే బంధమేది?..’ అంటూ సాగే ఈ పాట నందమూరి అభిమానులను బాగానే ఆకట్టుకుంటోంది.
అయితే అదే సమయంలో తెలుగుదేశం ఏర్పాటు చేసిన మహా కూటమి తెలంగాణా ఎలక్షన్స్ లో పరాజయం పాలవటం, దానికి బాలకృష్ణ ప్రచారం చేయటం..ఆయన సపోర్ట్ చేసిన పైసా వసూల్ నిర్మాత ఆనంద్ ప్రసాద్, అన్నకూతురు సుహాసిని పరాజయం పాలవటం వంటి విషయాలకు ముడి పెడుతున్నారు.
ఆ పాట వింటూంటే బాలయ్య…బాధతో నిర్వేదంతో పాడుకుంటున్నట్లు ఉంది అంటున్నారు. ఫెరఫెక్ట్ టైమింగ్ గా ఈ పాట వదిలారే అని సోషల్ మీడియాలో సెటైర్స్ వేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ఎం.ఎం కీరవాణి సంగీతం అందించారు. మిగిలిన పాటల్ని కూడా ఈ నెలలోనే విడుదల చేస్తారని సమాచారం.
అయితే ఈ పాట మొత్తం వింటే ఎన్టీఆర్ గొప్పతనం , ఆయన రాజర్షిగా మారి మెలిగిన వైనం గుర్తుకు వస్తుంది. కీరవాణి ఎంతో అద్బుతంగా ఈ పాటని రూపొందించారని తెలుస్తుంది. ప్రతీ విషయం వెటకారం చేయటం కాకపోతే ఇంత మంచి పాటను కెలకటం ఏమిటి అని అభిమానులు అంటున్నారు.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా, శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్, ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాలన్, హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్, అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో సుమంత్, సావిత్రి పాత్రలో నిత్యామేనన్ నటిస్తున్నారు.
జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎన్ బి కే ఫిల్మ్స్, వారాహి చలనచిత్రం, విబ్రి మీడియా సంస్థలపై నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలు జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.