NTR ట్రీట్: `టైగ‌ర్ ఫైట్` గ్లాడియేట‌ర్ రేంజులో?

NTR ట్రీట్: `టైగ‌ర్ ఫైట్` గ్లాడియేట‌ర్ రేంజులో?

బ‌త‌కాలంటే చంపాలి. చంపాలంటే సాహ‌సం చేయాలి. కొలాషియం (గ్రీకుల గ్రౌండ్)లో దిగి వీరుడిలా పోరాడాలి. ప‌ది మంది శ‌త్రువులు ఒకేసారి మీదికి ఉరికినా మ‌ట్టి క‌రిపించాలి. ఇలాంటి వీర‌త్వాన్ని ఎంతో ఉత్కంఠ‌గా ఆవిష్క‌రించారు కాబ‌ట్టే `గ్లాడియేట‌ర్` చిత్రం అంత పెద్ద స‌క్సెస్ సాధించింది. యుద్ధం అంటే ఈ రేంజులో ఉంటుందా? వీరుడు అంటే వీర‌త్వం అంటే ఆ లెవ‌ల్లో ఉంటుందా? అంటూ ర‌సెల్ క్రో పోరాటాల్ని చూసి షాక్ కి గుర‌య్యారు. ఇక ఈ హాలీవుడ్ చిత్రంలో బానిస అయిన ర‌సెల్ క్రో టైగ‌ర్ ఫైట్ సినిమాకే హైలైట్. నాలుగు వైపుల నుంచి మీది మీదికి ఉరికే టైగ‌ర్స్ మ‌ధ్య‌లో నిల‌బ‌డి శ‌త్రువుతో పోరాడాలి. పోరాడి గెల‌వాలి. ఆ ఫైట్ గ్లాడియేట‌ర్ సినిమాకే ఎంతో ప్ర‌త్యేకం. గ్లాడియేట‌ర్ స్ఫూర్తితో ఎన్నో సినిమాలు వ‌చ్చినా ఇప్ప‌టికీ గ్లాడియేట‌ర్ గురించే అభిమానులు ప్ర‌స్థావిస్తారంటే ఆ మూవీ ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే పోరాటాల్ని ఏ రేంజులో చిత్రీక‌రించారో అర్థం చేసుకోవాలి.

అయితే సేమ్ టు సేమ్ అలాంటిదే కాదు కానీ.. ఆర్.ఆర్.ఆర్ చిత్రంలోనూ ఓ టైగ‌ర్ ఫైట్ ఉంది. దానిని రాజ‌మౌళి ఎంతో ఉత్కంఠ రేకెత్తించేలా ఎలివేట్ చేయ‌నున్నార‌ని తొలి నుంచి ప్ర‌చారం సాగుతోంది. గిరిజ‌న వీరుడు అయిన కొమ‌రం భీమ్ టైగ‌ర్ తో పోరాడుతాడు. ఆ ఫైట్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుంద‌న్న ప్ర‌చారం ఇదివ‌ర‌కూ సాగింది. ఇప్పుడు ఆ ఫైట్ గ్లింప్స్ ని తార‌క్ అభిమానులు వీక్షించేందుకు రెడీ చేస్తున్నార‌ట జ‌క్క‌న్న‌. మే 20 తార‌క్ బ‌ర్త్ డేని పుర‌స్క‌రించుకుని రిలీజ్ చేయ‌నున్న ఫ‌స్ట్ లుక్ విజువ‌ల్ గ్లింప్స్ లో టైగ‌ర్ ఫైట్ హైలైట్ గా నిల‌వ‌నుంద‌ని చెబుతున్నారు. బానిస సాటి బానిస‌ను చంపి విజేత‌గా నిలిస్తే.. వీరుడిగా ప‌రిగ‌ణించి విడుద‌ల చేస్తారు. అయితే అలాంటి థీమ్ లైన్ తో గిరిజ‌న వీరుడైన కొమురం భీమ్ పాత్ర‌ను మ‌లిచారా జ‌క్క‌న్న? లేదూ ఇంకేదైనా కొత్త‌ద‌నాన్ని ఆ పాత్ర‌లో ఆవిష్క‌రిస్తున్నారా? అన్ని చూడాలి. ఇక చ‌ర‌ణ్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసిన‌ప్పుడు కొన్ని విమ‌ర్శ‌ల్ని ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. ఇప్పుడు తార‌క్ లుక్ విజువ‌ల్ ట్రీట్ విష‌యంలో అలాంటి మిస్టేక్ జ‌ర‌గ‌ద‌నే ఫ్యాన్స్ భావిస్తున్నారు. అలాగే ఈ మూవీని జ‌న‌వ‌రి 8న‌ రిలీజ్ చేయ‌డం సాధ్యం కాక‌పోతే మేకి వాయిదా వేసేందుకు ఆస్కారం ఉంద‌ని తెలుస్తోంది.