టాలీవుడ్ లో చాలా మంది టాప్ స్టార్స్ ఉన్నారు. కొందరు చెన్నై, హైదరాబాద్ అంటూ వెళ్లి టాప్ స్టార్లు అయ్యారు. ఇంకొందరు అలాగే వెళ్లి అవారాలు అయ్యారు. డాక్టర్స్ కావాల్సిన వాళ్లు యాక్టర్లు అయిన వాళ్లు కొందరైతే..యాక్టర్లు కావాల్సిన వాళ్లు డాక్టర్లైన వాళ్లు ఉన్నారు. కొందరు అనుకోకుండా నటులైతే..ఇంకొందరు అనుకుని కూడా నటులు కాలేని వాళ్లు చాలా మంది ఉన్నారు. ఇలా కారణాలు ఏవైనా! చదువుకున్న చదువుకు…ప్రస్తుతం ఉన్న వృత్తికి ఎంత మాత్రం సంబంధం లేకుండా చాలా మంది జీవనం సాగిస్తున్నారు. ఓసారి టాలీవుడ్ హీరోల కొందరు చదువుల గురించి చర్చిస్తే ఆసక్తికర సంగతులే బయటపడు తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి నర్సాపురం శ్రీ వై ఎన్ కాలేజీలో బికామ్ పూర్తిచేసారు. ఆ తర్వాత తండ్రి కోరిక మేరకు సీఏ చేయాలని మద్రాస్ వెళ్లారు. కానీ అప్పటికే చిరంజీవికి సినిమాలంటే విపరీతమైన మక్కువ. సినిమాల్లో స్థిరపడాలని చిన్నప్పటి నుంచి ఉండేది. దీంతో సీఏని పక్కనబెట్టి సినిమాల వేట మొదలు పెట్టారు. ఈ విషయం తండ్రికి తెలిసి మందలించినా చిరు దిశను మార్చుకోలేదు. తను అనుకున్నది సాధించాలని బలంగా సంకల్పించి నేడు మెగాస్టార్ గా ప్రేక్షకుల తో నీరాజనాలు అందుకుంటున్నారు. అలా చిరంజీవి చార్టెడ్ అకౌంటెంట్ కాబోయి యాక్టర్ అయ్యారు. ఇక విక్టరీ వెంకటేష్ చిన్న నాటి నుంచి గోల్డెన్ స్పూన్. హైదరాబాద్ లయోలా కాలేజీలో బికామ్ పూర్తిచేసాడు. ఆపై విదేశాల్లో మాస్టర్స్ చదువుకున్నాడు. మాస్టర్స్ చివరి సంవత్సరం లో నిర్మాత రామానాయుడుకి హీరో సమస్య తలెత్తడంతో వెంకటేష్ ముఖానికి మేకప్ వేసి రంగంలోకి దించేసారు.
వెంకీ ఏనాడు నటుడవ్వాలనుకోలేదు. మంచి బిజినెస్ మెన్ గా ఎదగాలనుకున్నాడు. అలా వెంకీ వ్యాపార వేత్త కాబోయి నటుడయ్యారు. కింగ్ నాగార్జున చెన్నైలోని ఇంజనీరింగ్ పూర్తిచేసాడు. ఆ తర్వాత అమెరికాలో ఆటోమోబైల్స్ లో మాస్టర్స్ కంప్లీట్ చేసారు. తర్వాత తండ్రి అక్కినేని నాగేశ్వరరావు బాటలో సినిమాల్ని ఎంచుకుని స్థిరపడ్డారు. తమిళనాడు వాసి యాంగ్రీస్టార్ రాజశేఖర్ డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యారు. ఎంబీ బీ ఎస్ పూర్తిచేసిన అనంతరం ప్రాక్టీస్ పెట్టి అటుపై సినిమాలనే వృత్తిగా ఎంచుకున్నారు. ఇక నటసింహ బాలకృష్ణ నిజాం కాలేజీలో కామర్స్ లో డిగ్రీ పూర్తిచేసారు. ఆయన చిన్న ప్పటి నుంచి చాలా గారాబంగా పెరిగారు. ఆయన ఓ రెబల్. తండ్రి వారసత్వంతో సినిమాల్లోకి వచ్చారు.
ఇక అదే ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ రామ్ చదువులో తెలివైన విద్యార్ధి. బిట్స్ పిలానీ యూనివర్శీటి నుంచి పట్టబద్రుడు. మంచి బిజినెస్ మేన్. ప్రస్తుత జనరేషన్ మెగా ఫ్యామిలీ హీరోలందరిలో సాయిధరమ్ తేజ్ బాగా చదువుకున్నాడు. చిన్నప్పటి నుంచి తెలివైన విద్యార్ధి. దేశంలోనే టాప్ యూనివర్శిటీ అయిన ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మేనేజ్ మెంట్(ఐఐపీఎం) నుంచి బయోటెక్నాలజీలో డిగ్రీ సంపాదించాడు. ఆ తర్వాత ఎంబీఏ పూర్తిచేసాడు.