`మా` కొత్త అధ్య‌క్షుడు న‌రేష్‌

ఎట్ట‌కేల‌కు ఓ స‌స్పెన్స్‌కు తెర ప‌డింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో న‌రేష్ విజ‌య్ కృష్ణ విజ‌యం సాధించారు. గ‌త‌ కొన్నిరోజులుగా అంత‌ర్గత క‌ల‌హాల‌తో అట్టుకుడిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల స‌మయానికి ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. నువ్వా నేనా అన్న‌ట్లుగా జ‌రిగిన మా ఎన్నిక‌ల్లో శివాజీ రాజా వ‌ర్గంపై న‌రేష్ వ‌ర్గం విజ‌యం సాధించింది.

గ‌తసారి ఎన్నిక‌లు లేకుండా ఏక‌గ్రీవంగా `మా` అధ్య‌క్షుడిగా శివాజీ రాజా ఎన్నిక‌య్యారు. `మా` ప‌రంగా కొన్ని మంచి ప‌నులు జ‌రిగాయి. అయితే కొన్ని విష‌యాల్లో బేదాభిప్రాయాలు రావ‌డంతో మాజీ అధ్య‌క్షుడు శివాజీ రాజా, కొత్త‌గా అధ్య‌క్షుడిగా ఎన్నికైన న‌రేష్‌కు మ‌ధ్య పోటీ అనివార్యమైంది. (న‌రేష్ గ‌త ప్యానెల్‌లో కార్య‌ద‌ర్శిగా పనిచేశారు).

745 ఓట్ల‌లో ఎన్న‌డూ లేని విధంగా 472 ఓట్లు పోల‌య్యాయి. చిరంజీవి, నాగార్జున వంటి వారు వ‌చ్చి ఎన్నిక‌ల్లో ఓటు వేశారు. న‌రేష్ అధ్య‌క్షుడిగా ఎన్నిక‌వ‌గా, న‌రేష్ ప్యానెల్ నుండి జీవితా రాజ‌శేఖ‌ర్ కార్య‌ద‌ర్శిగా ఎన్నిక‌య్యారు. వైస్ ప్రెసిడెంట్స్‌గా ఎస్‌.వి.కృష్ణారెడ్డి, హేమ‌, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా డా.రాజ‌శేఖ‌ర్ ఎన్నిక‌య్యారు. అలాగే జాయింట్ సెక్ర‌ట‌రీగా గౌతంరాజు, శివ‌బాలాజీ ఎన్నిక‌య్యారు.