‘గ్యాంగ్ లీడర్’ : నాని,కార్తికేయ పాత్రలు ఇవే

జెర్సీ చిత్రం సూపర్ హిట్ టాక్ తో మంచి జోష్ లో ఉన్న నాని ..తన తదుపరి చిత్రంపై దృష్టి పెట్టారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందే ఆ చిత్రం ఆ మధ్యన ప్రారంభమైంది. అమ్మాయి ఇది మీ కోసమే అంటూ విభిన్న ప్రమోషన్‌ ప్రారంబించిన నాని ఈ సినిమా టైటిల్‌ విషయంలో కూడా అదే ఫార్ములా ఫాలో అయ్యాడు.

మెగాస్టార్‌ చిరంజీవి సూపర్‌ హిట్ సినిమా ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్‌ను తన సినిమా కోసం తీసుకున్నాడు. ఇప్పటికే షూటింగ్ మొదలై దాదాపు సగ భాగం పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో నాని ఓ స్క్రిప్టు రైటర్ గా కనిపించనున్నారని తెలుస్తోంది. అలాగే ఐదుగురు అమ్మాయిల గ్యాంగ్ కు లీడర్ గా పనిచేస్తాడు.

బ్యాంక్ రోబరీతో మొదలయ్యే ఈ చిత్రంలో కరుడుగట్టిన దొంగగా ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ కనిపిస్తాడు. కేవలం కార్తికేయ మాత్రమే కాకుండా మరో విలన్ సైతం సినిమాలో ఉంటాడు. అతని మీద ఓ ట్విస్ట్ ఉంటుంది. ఇప్పటివరకూ నాని చేయని ఓ విభిన్నమైన కథతో ఈ సినిమా రూపొందనుందని సమాచారం.

మరో ప్రక్క ఇటీవల ఎనౌన్స్‌ అయిన ఈ సినిమా టైటిల్‌పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అభిమానులు నాని మెగా టైటిల్‌ను తీసుకోవటంపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఏకంగా ‘బాయ్‌కాట్‌ నానీస్‌ గ్యాంగ్‌ లీడర్‌’(#BoycottNanisGangLeader) అనే హ్యాష్‌ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. గతంలో ఇదే టైటిల్‌ను సాయి ధరమ్‌ తేజ్‌ సినిమాకు తీసుకోవాలని భావించినా అభిమానులు వ్యతిరేకించటంతో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నాడు. మరి ఈ ట్రోలింగ్‌పై నాని ఎలా స్పదింస్తాడో చూడాలి.