నేచురల్ స్టార్ అనే బిరుదును పొందిన నాని.. తన 12 ఏళ్ల సినిమా కెరీర్ లో మొదటిసారి తన సినిమా వీని ఓటీటీలో విడుదల చేస్తున్నాడు. దానికి కారణం కూడా అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో సినిమా థియేటర్లు మూతపడ్డాయి. ఒకవేళ సినిమా థియేటర్లు తెరుచుకున్నా.. జనాలు సినిమా థియేటర్లకు వెళ్లి సినిమా చూసే పరిస్థితులైతే ప్రస్తుతం కనిపించడం లేదు.
అందుకే.. చాలామంది హీరోలు తమ సినిమాలను ఓటీటీల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. వారిలో నాని కూడా ఒకరు. నిజానికి ఈ సినిమా గత మే నెల 25వ తేదీనే రిలీజ్ కావాల్సి ఉంది. కరోనాతో వాయిదా పడింది.
గత 12 ఏళ్ల నుంచి మిమ్మల్ని థియేటర్లలో పలకరిస్తున్న నేను.. ఈసారి మాత్రం మీ ఇంటికే వస్తున్నా… ఈసారి అందరం కలిసి సెప్టెంబర్ 5న సెలబ్రేట్ చేసుకుందాం.. అని నాని ట్వీట్ కూడా చేశాడు. అంటే.. సెప్టెంబర్ 5న ఓటీటీలో వీ సినిమా రిలీజ్ అవ్వబోతున్నదన్నమాట. దీంతో నాని ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోతున్నారు.
అంతవరకు బాగానే ఉంది కానీ.. నాని వీ సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే.. అది ఫేక్ ఏం కాదు.. నిజంగా వీ సినిమా స్టోరీ ఇదేనంటూ సినీ వర్గాలు కూడా గుసగుసలాడుతున్నాయి.
నాని భార్య అదితి రావు హైదరీని ఎవరో చంపేస్తారు. తన భార్యను చంపిన వాళ్ల మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం నాని వీ అవతారం ఎత్తుతాడు.
తన భార్యను చంపిన వాళ్లను ఒక్కొక్కరిగా చంపుతూ అక్కడ వీ అనే ఓ ముద్రను వదిలి వెళ్తాడు. సిటీలో వరుసగా ఒకే తరహాలో మర్డర్లు జరుగుతుండటంతో ఆ మర్డర్లపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెడతారు. ఈ కేసును పోలీస్ ఆఫీసర్ రోల్ లో నటించిన సుధీర్ బాబు టేకప్ చేస్తాడు. ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఆ కేసును ఛేదించడం కోసం సుధీర్ బాబు అష్టకష్టాలు పడుతాడు. చివరకు నాని ఫోన్ నెంబర్ కనుక్కోగలిగి.. నానికి ఫోన్ చేసి సవాల్ విసురుతాడు.
ఇక.. అదితిని ఎవరు చంపారు? నాని మర్డర్ చేశాక.. వీ అనే ముద్రను ఎందుకు వదిలాడు.. సుధీర్ బాబు చివరకు నానిని పట్టుకున్నాడా? లేదా? అనేదే మిగితా స్టోరీ.
ఈ సినిమాకు మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తుండగా… దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. దాదాపు 40 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తీశారు.