(ధ్యాన్)
అక్కినేని నాగార్జున, స్టార్ డైరక్టర్ మణిరత్నం పేర్లు చెప్పగానే మనకు గుర్తొచ్చే పేరు `గీతాంజలి`. వారిద్దరు కలిసి చేసిన మ్యాజిక్‌ని ఇప్పటికీ ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోలేదు. అలాంటిది ఇప్పుడు ఇద్దరూ ఢీ అంటే ఢీ అని అనుకుంటున్నారు. అయితే అది పర్సనల్‌గా కాదనుకోండి. సినిమాల పరంగానే.
అక్కినేని నాగార్జునకు, వెర్సటైల్ డైరక్టర్ మణిరత్నం చిత్రాలకు మధ్య వార్ తప్పడం లేదు. నాగార్జున, నాని కలిసి నటిస్తోన్న `దేవదాసు`ను సెప్టెంబర్ 27న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించే ఈ సినిమాను అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. మహానటివంటి సక్సెస్‌ఫుల్ సినిమా తర్వాత ఆ బ్యానర్ నుంచి వస్తున్న సినిమా ఇది. సో నిర్మాత ప్రతిష్టాత్మకంగా విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
మరో వైపు ఎంతో మంది స్టార్‌కాస్ట్ తో మణిరత్నం తెరకెక్కించిన సినిమా నవాబ్. ఈ సినిమాను సెప్టెంబర్ 28న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మణిరత్నం సినిమా పేరుకు డబ్బింగ్ సినిమానే అయినప్పటికీ ఎవరూ దాన్ని డబ్బింగ్ సినిమాలాగా చూడరు. పాన్ ఇండియా మూవీ కావడంతో థియేటర్ల మీద ఆ ఇంపాక్ట్ ఉంటుంది. చాన్నాళ్ల తర్వాత సోలో రిలీజ్‌గా వద్దామనుకున్న నాగార్జున ఈ పోటీని ఊహించకలేదట. కొత్తగా ఇదేంటి? సోలోగానే వస్తున్నామని అనుకున్నాం కదా అని సన్నిహితుల మధ్య అన్నట్టు సమాచారం.
తమిళంలో ఎంతగానో హిట్ అయిన చతురంగవేట్టై తెలుగులో బ్లఫ్ మాస్టర్ పేరుతో సెప్టెంబర్ 28న విడుదల కానుంది. ఈ సినిమా రీమేక్, పైగా చిన్న హీరో కాబట్టి ఆటలో అరటిపండులాగానే ఉంటుందన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.