మెగా బ్రదర్ నాగబాబు తన కూతురు నిహారికకు పెళ్లి చేయబోతోన్న సంగతి తెలిసిందే. గుంటూరు ఐజీ ప్రభాకర్ రావు తనయుడు జొన్నలగడ్డ చైతన్యతో నిహారికకు నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే తాజాగా నాగబాబు తనకు కాబోయే వియ్యంకుడిపై ప్రశంసలు కురిపించాడు. ఈ మేరకు నాగబాబు ఓ వీడియోను రిలీజ్ చేశాడు.
‘ఈనెల (ఆగష్టు) 31న రిటైర్డ్ కాబోతున్న ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ గారికి.. అభినందనలు తెలియజేస్తున్నా. వారితో త్వరలో వియ్యం అందుకోబోతున్నా. మా ఫ్యామిలీకి పోలీస్ డిపార్ట్ మెంట్‌తో తెలియని అనుబంధం ఉంది. మా నాన్న పోలీస్‌గా పనిచేశారు. మధ్యలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చేశారు.. మళ్లీ పోలీస్ డిపార్ట్మ్ంట్.. మళ్లీ అక్కడి నుంచి ఎక్సైజ్ ఇలా వచ్చారు. మా నాన్నగారి కోరిక ఏంటంటే.. మా ముగ్గురు అన్నదమ్ముల్లో ఎవరొకర్ని ఐపీఎస్ చేయాలని.. కాని ఎవరం ఆ ఫీట్ సాధించలేకపోయాం.
కాని ఇన్నాళ్లకు ప్రభాకర్ గారితో వియ్యం అందుకునే ఛాన్స్ వచ్చింది. ఆ విధంగా ఓ పోలీస్ మా ఫ్యామిలీలో భాగం కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన 1990లో సర్వీస్‌లో చేరారు. అంతకు ముందు ప్రైవేట్ జాబ్ చేసేవారు. కాని పోలీస్ అయితే.. ప్రజలకు మరింత సర్వీస్ చేయోచ్చు, వారితో దగ్గరగా ఉండొచ్చని గ్రూప్ 1లో ఆఫీసర్‌గా పోలీస్ డిపార్ట్మెంట్లోకి అడుగుపెట్టారు. రీసెంట్గా ఆయన కరోనా ముందు వరకూ పదవీ బాధ్యతలు నిర్వర్తించారు.
డీఎస్పీగా పదవీ బాధ్యతలు చేపట్టిన కొత్తలో.. గుంటూరలో ఓ రౌడీ షీటర్ ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటే రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకుని వెళ్లి రౌడీయిజాన్ని కట్టడి చేశారు. అలాగే రాజమండ్రిలో టెర్రరిస్ట్‌లు చొరబడినప్పుడు వాళ్లని చాలా చాకచక్యంగా పట్టుకుని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. రాయలసీమలో పనిచేస్తున్నప్పుడు ఫ్యాక్షన్ వల్ల వచ్చే నష్టాన్ని తెలియజేస్తూ వాళ్లతో మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. ఆయన గురించి చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయ’ని నాగబాబు వియ్యంకుడిపై ప్రశంసలు కురిపించాడు.