(ధ్యాన్)
అల్ రెడీ చేతులు కాల్చుకున్నా – హీరో నాగశౌర్య
స్వంత నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్‌ను స్టార్ట్ చేసి..హీరోగా, నిర్మాతగా నాగశౌర్య చేసిన తొలి ప్రయత్నం `ఛలో` మంచి విజయాన్ని దక్కించుకుంది. ఇప్పుడు రెండో ప్రయత్నమే `@నర్తనశాల`. కశ్మీర పరదేశి, యామినీ భాస్కర్ హీరోయిన్స్. ఈ చిత్రం ఈ నెల 30న విడుదలవుతుంది. ఈ సందర్భంగా నాగశౌర్యతో చిట్ చాట్….
`@నర్తనశాల` కంటే ముందు సినిమాటోగ్రాపర్ సాయిశ్రీరామ్‌తో సినిమా చేయాల్సింది కదా?
– అవును నిజమే!.. అయితే కారణాలు ఇప్పుడు చెప్పలేను కానీ.. కొన్ని కారణాలతో సినిమా ఆగిపోయింది. అయితే నాకు, సాయి శ్రీరామ్‌కు మధ్య అనుబంధం చెడిపోలేదు. నా తదుపరి సినిమా భవ్యక్రియేషన్స్‌లో చేయబోతున్నాను. దానికి సాయి శ్రీరామే కెమెరామెన్‌గా వర్క్ చేస్తున్నారు.
టైటిల్‌కు ముందు @ గుర్తును ఎందుకు పెట్టారు?
– నర్తనశాల టైటిల్ పెడదామని అనుకోగానే… `ఆ టైటిల్‌తో ఎన్టీఆర్‌గారి సినిమా తర్వాత మరో సినిమా రూపొందలేదు. స్టార్ట్ అయిన సినిమాలన్నీ ఆగిపోయాయి` అని నాన్నగారు చెప్పారు. కానీ కథకు తగ్గ టైటిల్ కావడంతో.. దానికి ముందు @ అనే గుర్తును యాడ్ చేశాం.
గే పాత్రలో నటించడం వెనుక రీజనేంటి?
– ఇందులో హీరో గేనా లేదా ఏదో కారణంతో అలా నటిస్తాడా అనేది తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే. నా క్యారెక్టర్ విషయానికి వస్తే స్త్రీ సాధికారత కోసం పనిచేస్తుంటాను. అమ్మాయిలు ధైర్యంగా ఉండాలని చెప్పే పాత్రలో నటించాను. అలాగని సినిమాలో ఎవరిని కించపరలేదు. ఎలాంటి మెసేజ్‌లు ఇవ్వలేదు. ఇదొక కమర్షియల్ మూవీ.
ఖాలీ సమయాల్లో ఏం చేస్తుంటారు?
– వీడియో గేమ్స్ ఆడుతుంటాను. వెబ్ సిరీస్‌లు చూస్తుంటాను. ఇప్పటి వరకు నెట్‌ఫ్లిక్స్‌ల్లోని వెబ్ సిరీస్ చూసేశాను. కుదిరితే వెబ్ సిరీస్‌లు చేయాలని ఉంది. ఎవరైనా చేయమని అడిగితే తప్పకుండా నటిస్తాను.
బై లింగువల్ సినిమాలు కంటిన్యూ చేస్తారా?
– ముందు ఇక్కడ హీరోగా ప్రూవ్ చేసుకోవాలి. తర్వాతే ఇతర భాషల గురించి ఆలోచించుకోవచ్చు. అల్ రెడీ ఓ బైలింగువల్ చేసి చేతులు కాల్చుకున్నాను. ఇప్పట్లో బై లింగువల్ చేయాలనే ఆలోచన లేదు.
మల్టీస్టారర్స్ లో నటిస్తారా?
– నారా రోహిత్‌తో ఉన్న అనుబంధంతో `జో అచ్యుతానంద` సినిమాలో నటించాను. ఇకపై మల్టీస్టారర్ సినిమాలు చేయను.