చిన్న చిత్రాల నిర్మాణంలోకి పెద్ద సంస్థ‌….

                                                                               (ధ్యాన్)

పెద్ద పెద్ద స్టార్స్‌తో సినిమాలు చేయ‌డం అంటే గుర్తింపు, క్రేజ్ ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. సినిమా బిజినెస్ విష‌యంలో కూడా స‌మ‌స్య‌లు ఉండ‌వు కాబ‌ట్టి నిర్మాత‌లు కూడా స్టార్ హీరోల సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపుతుంటారు. అయితే ఇప్పుడు నెమ్మ‌దిగా ట్రెండ్ మారుతుంది. పెద్ద సినిమాల‌తో పాటు లో బ‌డ్జెట్ సినిమా.. కాన్సెప్ట్ బేస్‌డ్ సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపుతున్నారు. అందుకు ప్ర‌త్యేకంగా కార‌ణాలు చెప్ప‌న‌క్క‌ర్లేదు. కొత్త క‌థా చిత్రాల‌ను ప్రేక్ష‌కులు చాలా బాగా ఆద‌రిస్తున్నారు. ఇక్క‌డ క‌థే ముఖ్యం కానీ న‌టీన‌టులు, డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నేది ముఖ్యం కాదు. ఆ కోవ‌లోనే అర్జున్ రెడ్డి, ఆర్‌.ఎక్స్ 100, గూఢ‌చారి .. వంటి సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద గ‌ట్టి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టుకున్నాయి. దీంతో ఓ అగ్ర నిర్మాణ సంస్త చిన్న చిత్రాల‌ను నిర్మించాల‌ని అనుకుంటుద‌ట‌. ఆ సంస్థ ఏదో కాదు.. మైత్రీ మూవీ మేక‌ర్స్‌. 

ఇప్ప‌టికే పెద్ద స్టార్స్‌.. ఓ మోస్త‌రు స్టార్స్‌తో 12 ప్రాజెక్టుల‌ను అనౌన్స్ చేసిన ఈ సంస్థ ఓ ప్ర‌ణాళిక ప్ర‌కారం ముందుకెళుతుంది. అయితే వీరు కేవ‌లం భారీ చిత్రాల‌నే చేస్తార‌నే టాక్ ఇండ‌స్ట్రీలో వినిపిచండంతో పాటు.. ఆడియెన్స్ అభిరుచిని గుర్తెరిగి వీరు మ‌రో కోణంలో కూడా ఆలోచించార‌ట‌. త‌మ బ్యాన‌ర్‌లో లో బ‌డ్జెట్ సినిమాలు చేయాల‌నుకుంటున్నార‌ట‌. అందులో భాగంగా ఇప్ప‌టికే ఓ సినిమాకు రంగం సిద్ధం చేసేశార‌ట‌. టైటిల్ ఏంటో తెలుసా! సీనియ‌ర్ ఎన్టీఆర్ కృష్ణ పాత్ర‌ధారిగా చేసిన ఓ సినిమా పాట ప‌ల్ల‌విలో ఓ ప‌దం. ఇందులో సంస్థ మిన‌హా.. డైరెక్ట‌ర్ నటీన‌టులు, సాంకేతిక నిపుణులు అంద‌రూ కొత్త‌వారే. త్వ‌ర‌లోనే సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. త్వ‌ర‌లోనే అధికారిక స‌మాచారం కూడా వెలువ‌డ‌నుంది.