మోహన్ బాబు నుంచి ఎక్సపెక్ట్ చేసిన కామెంటే

ఎన్టీఆర్‌ జీవితాధారంగా తెరకెక్కిన చిత్రం ‘యన్‌టిఆర్: కథానాయకుడు’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ట్వీట్‌ చేశారు మోహన్‌బాబు. ఆ కామెట్స్ చదివిన వారు..ఈ విధంగా మోహన్ బాబు మాట్లాడతారని ముందే ఊహించామంటున్నారు. ఎందుకంటే మోహన్ బాబుకు, నందమూరి కుటుంబానికి ఉన్న అనుబంధం అటువంటిది. ఇంతకీ మోహన్ బాబు ఏమన్నారంటే…‘యన్‌టిఆర్‌’ సినిమాలోని కొన్ని సన్నివేశాలను చూసినప్పుడు అన్నయ్య మళ్లీ పుట్టినట్లు అనిపించిందని అంటున్నారు.

‘రామారావు.. నాకు అన్నయ్య. ‘ఏక గర్భమునందు జన్మించకపోయినా మనమిద్దరం అన్నదమ్ములం’ అని చెప్పిన మహానుభావుడు. ఆయన బయోపిక్‌ని తెలుగులో తీయడమనేది మామూలు విషయం కాదు. అందులోనూ కుమారుడు బాలయ్య తన తండ్రి చేసిన పాత్రలను పోషించడం అనేది కూడా మామూలు విషయం కాదు.

అది కొంచెం కష్టతరమైన పని. బాలకృష్ణ ఒక మంచి దర్శకుడి చేతిలో పడి, ఆ సినిమాను నిర్మించి, నటించాడంటే.. ఇదొక అద్భుతం, అమోఘం. ఆడియో ఫంక్షన్‌కు నన్ను పిలిచారు. నేను వెళ్ళాను. కొన్ని క్లిప్పింగ్స్ చూస్తే మళ్లీ అన్నయ్య పుట్టాడా..? అనిపించింది. బాలకృష్ణ కొన్ని యాంగిల్స్‌లో తన తండ్రిని పోలి ఉండడం అనేది కూడా ఒక అద్భుతం. ఈ సినిమా అత్యద్భుతమైన విజయాన్ని సాధిస్తుందని నమ్ముతూ ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను.’ అని పేర్కొన్నారు.

ఎన్టీఆర్ మరణానంతరం దాదాపు 23 ఏళ్ల తర్వాత ఆయన బయోపిక్‌ తెరకెక్కింది. ఎన్టీఆర్ పాత్రలో ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ నటించిన ఈ సినిమాని భారీ రేట్లకు అమ్మారు.

ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో విద్యాబాలన్, హరికృష్ణగా కల్యాణ్‌రామ్ నటించారు. రానా, సుమంత్, నిత్యామీనన్, రకుల్ ప్రీత్ సింగ్, నరేష్, ప్రకాశ్‌రాజ్, కైకాల సత్యనారాయణ వంటి భారీ తారాగణంతో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ బయోపిక్‌ రూపొందింది.

ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. సినీ జీవితాన్ని మొదటి భాగంలో, రాజకీయ జీవితాన్ని రెండో బాగంలో చూపిస్తున్నారు. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు పేర్లతో నెల రోజుల గ్యాప్‌లోనే రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.