`మీటూ` ని అలా దుర్వినియోగం చేయద్దంటూ ర‌కుల్

హాలీవుడ్ లో మొదలై బాలీవుడ్ పరిశ్రమలో  సంచనలనం రేపుతున్న  ఉద్యమం.. `మీటూ`. ఈ ఉద్యమం సెగ ఇప్పుడు టాలీవుడ్ , కోలీవుడ్ లను కూడా కుదిపేస్తోంది. ఈ ఉద్యమానికి చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ సపోర్ట్ చేస్తున్నారు.  తెలుగులో ఇప్పటికే సమంత ఈ విషయమై మాట్లాడారు. దర్శకురాలు నందిని రెడ్డి ఆధ్వర్యంలో మీటింగ్ సైతం జరిగింది. ఈ నేపధ్యంలో  హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ సైతం `మీటూ` ఉద్యమం గురించి ఓ ఇంట‌ర్వ్యూలో తన అభిప్రాయాలను పంచుకున్నారు.


రకుల్ మాట్లాడుతూ… “మీటూ` ఉద్య‌మం మన దేశంలో వేళ్లూనుకోవ‌డం చాలా ఆనందాన్ని క‌లిగిస్తోంది.  ఈ లైంగిక వేధింపుల విష‌యంలో నేను చాలా అదృష్ట‌వంతురాల‌ని. నేనెప్పుడూ ఇలాంటి వేధింపుల‌ను ఎదుర్కోలేదు. అయితే లైంగిక వేధింపుల‌కు సంబంధించిన విష‌యాల‌ను విన్నాను. ఇప్ప‌టికైనా బాధితులంద‌రూ బ‌య‌ట‌కు వ‌చ్చి మాట్లాడుతుండ‌డం అభినంద‌నీయం. అయితే ప‌బ్లిసిటీ కోసం ఈ ఉద్యమాన్ని ఎవ‌రూ దుర్వినియోగం చేయ‌కూడ‌దు`అని ర‌కుల్ విజ్ఞ‌ప్తి చేసింది.

అలాగే  లైంగిక కోరిక‌లు తీర్చ‌మ‌ని వేధించ‌డం, ఆపోజిట్ జెండ‌ర్‌తో మిస్ బిహేవ్ చేయ‌డం పూర్తిగా భిన్న‌మైన‌వ‌ని నా అభిప్రాయం. ఈ రెండింటి మ‌ధ్య చిన్న గీత‌ ఉంది. ఏదేమైనా ఈ ఉద్యమానికి ఈ స్థాయిలో మ‌ద్ద‌తు రావ‌డానికి కార‌ణం సోష‌ల్ మీడియా అని మెచ్చుకుంది రకుల్. రకుల్ మాటలను అందరూ మెచ్చుకుంటున్నారు. ఉద్యమాన్ని పబ్లిసిటీ కోసం దుర్వినియోగం చేయకూడదంటూ ఆమె చెప్పిన మాటలు నిజం అని అంటున్నారు.