చిరంజీవిని మెగాస్టార్ గా చేసింది అభిమానులు. అదే అభిమానులు ఆయన్ని రాజకీయనాయకుడ్ని చేసారు. కానీ సినిమాల్లో సక్సెస్ అయినట్లుగా రాజకీయాల్లో సక్సెస్ కాలేదు. అభిమానించిన కోట్లాది మంది అభిమానులు రాజకీయంగా ఆయన వెనుక నిలబడ లేకపోయారు. ఆ విషయంలో అభిమానులు కొందరు నొటితో నవ్వి నోసటితో వెక్కిరించినట్లే చేసారు. 2009 ఎన్నికల్లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ఎన్ని స్థానాల్లో గెలిచిందో తెలిసిందే. ఆ పై పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి మెగాస్టార్ రాజకీయాల నుంచి దూరంగా జరిగారు. మరి చిరంజీవిని రాజకీయ పార్టీ స్థాపించడానికి అంతగా ప్రేరేపించడానికి గల కారణాలు ఏంటంటే? ఒకే ఒక్క సినిమా సక్సెస్ వేదిక చిరు మొదడును తొలిచేసి పార్టీ పెట్టేలా ప్రేరేపించిందన్నది ఓ సీనియర్ విశ్లేషకుడి అభిప్రాయం.
2002 లో విడుదలైన ఇంద్ర సినిమా చిరంజీవి కెరీర్ లో ప్రత్యేకమైన సినిమాగా నిలిచింది. అత్యధిక వసూళ్లతో..చిరంజీవికి ప్రత్యేకమైన ఇమేజ్ ని తీసుకొచ్చిన చిత్రమది. మెగాస్టార్ తొలిసారి రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో నటించిన చిత్రం కావడంతో ప్రేక్షకాభిమానలు బ్రహ్మరథం పట్టారు. ఇంద్ర సక్సెస్ చిరంజీవి కెరీర్ లో ఎప్పటికీ ఓ మైల్ స్టోన్ మూవీ. అయితే ఆ సినిమా సక్సెస్ మీట్ చిరంజీవిని రాజకీయాల వైపు పరుగులు పెట్టించిందన్నది ఓ పెద్దాయన అభిప్రాయం. ఆ సినిమా సక్సెస్ మీట్ విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో ఏర్పాటు చేసారు. అది ఓ మర్చంట్ అసోసియేషన్ కు చెందిన ఓ పెద్ద గ్రౌండ్. ఆ విజయోత్సవ కార్యక్రమానికి భారీ ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. దాదాపు 8 లక్షల మంది అభిమానులు హాజరైనట్లు తెలిసింది.
ఆ ప్రాంగణం జనాభా సామర్ధ్యం 12 లక్షలు కాగా 8 లక్షల మంది వరకూ హాజరైనట్లు ఓ అంచనా. ఓ సినిమా నటుడి కోసం అంత మంది అభిమానులు తరలిరావడం అంటే మామూలు విషయం కాదు. అప్పటివరకూ ఏ హీరో ఈవెంట్ కు అంత భారీ ఎత్తున అభిమానులు తరలి రాకపోవడం..కేవలం చిరంజీవి కోసమే కర్ణాటక, తమిళనాడు, కేరళ నుంచి కూడా అభిమానులు తరలి రావడం చిరంజీవిని రాజకీయాల వైపు ప్రేరేపించడానికి ఓ కారణంగా చెబుతున్నారు. అంతకు ముందు..ఆ తర్వాత చిరంజీవి నటించిన చాలా సినిమా ఈవెంట్లు జరిగాయి. కానీ `ఇంద్ర` విజయోత్సవానికి హాజరైనంతగా అభిమానులు మరో ఈవెంట్ కు హాజరు కాకపోవడం చిరంజీవిలో కొత్త ఉత్సాహం నింపినట్లు అయిందని…ఆ నమ్మకంతోనే చిరంజీవి ప్రజాక్షేత్రంలోకి వచ్చినట్లు చెబుతున్నారు.