వైజాగ్ టాలీవుడ్ నిర్మాణ కర్తగా మెగాస్టార్ చిరంజీవికి రేర్ ఛాన్స్ దక్కనుందా? వైయస్ జగన్‌తో తెరవెనక గేమ్ ప్లాన్ ఏమిటి? ఇంతకీ ప్లాన్ ఎంతవరకూ వచ్చింది? వీటన్నిటికీ నేటి బర్త్ డే బోయ్ చిరు వద్ద సమాధానం ఉందా?
టాలీవుడ్ 88 ఏళ్ల చరిత్రలో మెగాస్టార్ చిరంజీవి శకం సగం పైగానే కొనసాగింది. నాలుగు దశాబ్ధాల కెరీర్ లో ఆయన ఎన్నో మైలురాళ్లు అధిగమించారు. స్టార్ హీరోగా అత్యుత్తమమైన ట్రాక్ రికార్డుతో రాజ్యమేలారు. లెజెండ్ గా కీర్తి ప్రతిష్ఠలు అందుకున్నారు. అయితే అదంతా ఒకెత్తు అనుకుంటే ఆయన జీవితకాలంలో మిగిలి ఉన్న లేదా సాధించాల్సిన ఏకైక మెగా కార్యం ఏది? అంటే అది కచ్ఛితంగా `మరో టాలీవుడ్ నిర్మాణం` అని ఏపీ ప్రజలు వేచి చూస్తున్నారు. ఇది చిరు వల్లనే జరుగుతుందని బలంగా నమ్ముతున్నారు.
ఇటీవల ఏపీ పొలిటికల్ కారిడార్ లో ప్రముఖంగా చర్చకొచ్చిన అంశమిది. మెగాస్టార్ చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా మరో టాలీవుడ్ నిర్మాణం కోసం ఆహ్వానించారని.. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులా అమరావతి పేరుతో తాత్సారం చేయలేదని పరిశ్రమ వర్గాలే ముచ్చటించాయి. సినీపరిశ్రమ ఏర్పాటు విషయంలో జగన్ చొరవ చూసి పలువురు సినీపెద్దలు సైతం మనసు మార్చుకుని చిరంజీవి వెంట నడిచేందుకు సిద్ధమయ్యారని.. ఇండస్ట్రీ కులప్రాతిపదికన కాకుండా ఏపీ టాలీవుడ్ నిర్మాణానికి ఏకోన్ముఖం కానుందని ప్రచారమైంది.
ఏపీ నుంచి తెలంగాణ విడిపోయిన క్రమంలో ఓసారి మంత్రి కేటీఆర్ ఫిలింఛాంబర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో టాలీవుడ్ బీచ్ సొగసుల విశాఖ నగరానికి వెళుతుందని.. హైదరాబాద్ పరిశ్రమకు ధీటుగా ఎదగాలని ఆకాంక్షించారు. కానీ రకరకాల కారణాలతో ఇది ఎటూ కదల్లేదు. అయితే ఈ పరిణామానికి కారణం ఏపీలో రాజధాని నిర్మాణం పూర్తవ్వకపోవడం.., చంద్రబాబు విజువల్ గ్రాఫిక్స్ మూలన పడడం అన్నది అందరికీ తెలిసిన నగ్నసత్యం. రాజధాని రియల్ వెంచర్ల మత్తులో కొత్త టాలీవుడ్ ని ఆకులో వక్కలా లైట్ తీస్కున్నారు.
అయితే మెగాస్టార్ చిరంజీవి వైజాగ్ టాలీవుడ్ నిర్మాణంపై ఆసక్తిగా ఉన్నారని.. తొలిగా ఆయనే బరిలో దిగి విశాఖలో ఫిలింస్టూడియోని నిర్మించనున్నారన్న ప్రచారంతో ఒక్కసారిగా పరిశ్రమ వర్గాలు సహా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగింది. కొత్త టాలీవుడ్ నిర్మాణానికి ఏం కావాలో అడగాలని అన్నయ్య చిరంజీవికి చెప్పానని సీఎం జగన్ ఓ బహిరంగ సభలో ప్రకటించడంతో అది ఎంతో ఉత్కంఠను పెంచింది.
తెలంగాణకు హైదరాబాద్ కి గ్లామర్ తెచ్చిందే సినీపరిశ్రమ. టాలీవుడ్ వల్లనే ఈ అందం. అది ఏపీకి అవసరం లేదా? అన్నది ఎప్పటికీ ఎడతెగని ప్రశ్నగా మిగిలిపోయింది. అందుకే ఇప్పుడు సొల్యూషన్ చిరంజీవి- జగన్ జోడీ ఇస్తారా? లేక ఇంకా తాత్సారం చేస్తారా? అన్నది ఏపీ ప్రజలు ఆసక్తిగా వేచి చూస్తూనే ఉన్నారు. ఏపీకి రాజకీయాలు మాత్రమే మిగిలితే అదొక ఎడారిలా అనిపిస్తుంది. అలా కాకుండా కళల్ని వృద్ధి చేసేందుకు సినీపరిశ్రమను తేవాలి. అలాగే నాటకరంగానికి స్టేజీ డ్రామాకి డ్రామా కళాకారులకు నటులకు గొప్ప ఊతమివ్వాలి. అలాగే స్థానిక ప్రతిభకు మెరుగులద్దడానికి పూణే ఫిలింఇనిస్టిట్యూట్ తరహాలో ఏదైనా ఒక గొప్ప ఇనిస్టిట్యూట్ ని ఏపీకి తేవాలి. అది ఎప్పటికి సాధ్యమవుతుందో చూడాలి.
మరో టాలీవుడ్ నిర్మాణం అన్నది ఒక సవాల్ లాంటిది. ఔత్సాహిక ఫిలింమేకర్స్ ఎందరో ఉన్నా వాళ్లందరినీ ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు మరో టాలీవుడ్ ని నిర్మించేందుకు మెగాస్టార్ లాంటి జెంటిల్ మేన్ పూనుకోవడం అవసరం. ఇలాంటి రేర్ ఛాన్స్ ఛాయిస్ చిరంజీవి ముందు ఉంది. నేడు 65వ పుట్టినరోజున జరుపుకున్న బర్త్ డే బోయ్ ఇదొక్కటి సాధిస్తే పేరు చరిత్రలో నిలిచిపోతుంది. ఆయన ఏం థింక్ చేస్తున్నారో .. కొన్నిటికి కాలమే సమాధానం చెబుతుందేమో.. జస్ట్ వెయిట్…
– శివాజీ కొంతం