ఆ అవార్డు ఆయ‌న‌కు ఇంత ఆల‌స్యంగానా!

ప్ర‌ముఖ గేయ ర‌చ‌యిత‌ సిరివెన్నెల సీతారామ‌శాస్త్రితో సోమ‌వారం సాయంత్రం మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. తెలంగాణ నుంచి `ప‌ద్మ‌శ్రీ‌` అవార్డుకు సీతారామ‌శాస్త్రి ఎంపికైన నేప‌థ్యంలో.. చిరంజీవి మ‌ర్యాద‌పూర‌కంగా ఆయ‌న‌ను క‌లిశారు. పుష్ప‌గుచ్ఛం అంద‌జేసి శుభాకాంక్ష‌లు తెలిపారు. సీతారామ శాస్త్రి ప్ర‌తిష్ఠాత్మ‌క ప‌ద్మ‌శ్రీ అవార్డుకు ఎంపిక కావ‌డం త‌న‌కు ఆనందాన్నిస్తోంద‌ని ఈ సంద‌ర్భంగా చిరంజీవి పేర్కొన్నారు.

తాను న‌టించిన అనేక సినిమాల‌కు ఆయ‌న చిర‌స్మ‌ర‌ణీయ‌మైన పాట‌ల‌ను రాశార‌ని గుర్తు చేశారు. తమ కాంబినేష‌న్‌లో మంచి పాట‌లు వ‌చ్చాయ‌ని చెప్పారు. సీతారామ శాస్త్రి కేరీర్ ఆరంభంలోనే ప‌ద్మ అవార్డు రావాల్సి ఉంద‌ని చిరంజీవి అభిప్రాయ‌ప‌డ్డారు. ఆల‌స్యంగానైనా కేంద్ర‌ప్ర‌భుత్వం ఆయ‌న ప్ర‌తిభను గుర్తించింద‌ని చెప్పారు. చిరంజీవితో పాటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా, రచయిత సాయిమాధవ్ బుర్రా, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ సిరివెన్నెలను క‌లిసి శుభాకాంక్షలు తెలియజేశారు.