డాక్యుమెంటరీ డ్రామాగా  చిరంజీవి ‘సక్సెస్ ఫుల్ జర్నీ’

 కొరటాల శివ దర్శకత్వంలో  మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న’ఆచార్య’ సినిమా షూటింగ్ కు  కరోనా దెబ్బ తగిలి షూటింగ్ కు అంతరాయం ఏర్పడింది. దాంతో షూటింగ్  నిలిచిపోయింది. ఈ సమయంలో  ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కుటుంబ సభ్యులతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన చిరంజీవి ‘కరోనా క్రైసిస్ ఛారిటీ’ ఏర్పాటు చేసి సినీ కార్మికులకు అండగా నిలబడ్డారు. సినిమా షూటింగులు  మళ్లీ ప్రారంభించడానికి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనుమతులు వచ్చేలా చొరవ తీసుకున్నారు .

అయినా  రోజురోజుకి కరోనా తీవ్రత ఎక్కువ అవుతుండటంతో.. రిస్కు తీసుకోవడం ఎందుకని సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభించ లేదు.ఈ సమయాన్ని చిరంజీవి ఆత్మకథ రాయడానికి ఉపయోగించుకుంటున్నారట. ఇండస్ట్రీలో ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా అడుగు పెట్టి స్వయంకృషితో ‘మెగాస్టార్’‌గా ఎదిగారు చిరంజీవి. ఆయన కథ తెలుసుకోవాలని ప్రతి సినీ అభిమానికి ఉంటుంది. స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల ఆటోబయోగ్రఫీలు బయోపిక్ గా  వస్తున్న నేపథ్యంలో చిరు ఆటోబయోగ్రఫీ కూడా సినిమాగా రాబోతోందని వార్తలు వచ్చాయి.

అయితే చిరు తన ‘సక్సెస్ ఫుల్ జర్నీ’ని డాక్యుమెంటరీ డ్రామాగా తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారట.  తన ఆటోబయోగ్రఫీ కోసం  సంబంధించిన ఓల్డ్ వీడియోలు, ఫోటోలు సేకరించే పనిలో ఉన్నారట చిరు. మొత్తం మీద త్వరలోనే చిరంజీవి ఆటోబయోగ్రఫీ రానుందని తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత చిరంజీవి.. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించి సూపర్ హిట్టైన ‘లూసిఫర్’ సినిమాను రీమేక్ చేస్తున్నారు . దాని తర్వాత బాబీ దర్శకత్వంలో మరోచిత్రం  సన్నాహాల్లో ఉంది.