సినిమాటోగ్రఫీ మంత్రి తలసానికి మనం సైతం బర్త్ డే సెలబ్రేషన్స్

ప్రముఖ నటులు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనం సైతం సేవా సంస్థ తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించింది. హైదరాబాద్ వెస్ట్ మారేడ్ పల్లిలోని తలసాని స్వగృహంలో ఆయన్ను కలిసిన కాదంబరి కిరణ్, మనం సైతం సభ్యులు మంత్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి పరిశ్రమకు అండగా ఉంటూ ఇలాంటి మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ…ఇవాళ సినిమా పరిశ్రమలోని ప్రతి కార్మికుడూ ధైర్యంగా బతుకుతున్నాడంటే కారణం సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గారే. పరిశ్రమలో ప్రతి ఒక్కరి యోగ క్షేమాలపై తలసాని గారు శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎవరికేం ఇబ్బంది ఉన్నా చెప్పేందుకు మాకు అవకాశమిచ్చి…వాళ్లకు సాధ్యమైనంత సాయం చేస్తున్నారు. మనం సైతంకు పెద్ద అండ తలసాని గారు అన్నారు.

మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ…మనం సైతం పేదల పక్షాన నిలబడి వారి కష్టాలపై పోరాటం చేస్తోంది. పరిశ్రమలో ఇవాళ మనం సైతం పెద్ద భరోసా. అనారోగ్యం పాలైన వాళ్లు, పేదరికంతో చదువుకోలేని వారు, ఉన్నత విద్య కోసం ఎదురుచూస్తున్న వాళ్లు, వృద్యాప్యంలో ఉన్న వాళ్లకు మనం సైతం అండగా నిలబడుతోంది. ఆర్థికంగా ఆదుకుంటోంది. ఇంత గొప్ప సేవా కార్యక్రమం నిర్వహిస్తున్న మనం సైతం సభ్యులకు, కాదంబరి కిరణ్ కు అభినందనలు. అన్నారు.ఈ కార్యక్రమంలో మనం సైతం సభ్యులు సురేష్, శ్రీధర్ రెడ్డి, నిర్మాత సి. కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.