సూపర్ స్టార్ మహేష్ కి రాజకీయాలపై ఆసక్తి ఉందా? భవిష్యత్ లో రాజకీయారంగేట్రం చేస్తారా? అంటే నిరభ్యంతరంగా అందుకు ఆస్కారం లేదనే అభిమానులు చెబుతారు. బావ గల్లా జయదేవ్ రాజకీయాల్లో ఉన్నా కానీ మహేష్ అనవసరంగా రాజకీయాలకు వెళ్లలేదు ఏనాడూ. బావకు మాట సాయం ప్రచారం చేశాడేమో కానీ.. ప్రత్యక్ష రాజకీయాలపై ఏమాత్రం ఆసక్తిని చూపించలేదు. తనకు రాజకీయాలపై సరైన అవగాహన లేదని తప్పించుకోవడం మహేష్ కి అలవాటు.
అదంతా సరే కానీ.. మహేష్ కి రాజకీయాలపై ఆసక్తి లేకపోయినా రాజకీయాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆత్రుత ఉంటుందన్న సీక్రెట్ ని నటుడు పోసాని కృష్ణ మురళి వెల్లడించారు. ఇంతకుముందు ఎన్నికల్లో వైయస్సార్ పార్టీ.. జగన్ గెలుపుపై మహేష్ ఆరా తీశారట. దానికి కచ్ఛితంగా జగన్ సీఎం అవుతారని తాను చెప్పానని పోసాని వెల్లడించారు. ఏపీలో చంద్రబాబును ఓడించి జగన్ గెలుస్తాడని సినీ ఇండస్ట్రీలో ఎవరూ నమ్మలేదని.. పందేలు కాసారని పోసాని అన్నారు. వైఎస్ జగన్ గెలుపు అవకాశాల పై తనని మహేష్ అడిగేవారని తెలిపాడు. చంద్రబాబు పసుపు కుంకుమ సహా పథకాల పేరుతో రూ.10వేలు డబ్బులు పంచుతున్నాడు కదా జగన్ గెలుస్తాడా అని మహేష్ అడిగారట. ప్రజలు తెలివైన వారని జగన్ నే గెలిపిస్తారని తాను ధీమాను వ్యక్తం చేసేవారట.
మొత్తానికి ఇండస్ట్రీ వ్యవహారాలు కానీ.. రాజకీయాల గురించి కానీ కామన్ గా తెలుసుకునే అలవాటు మహేష్ కి ఉందన్నమాట. ఇక యాథృచ్ఛికంగానో ఏమో కానీ మహేష్ గత చిత్రం భరత్ అనే నేను లో యంగ్ సీఎంగా నటించిన సంగతి తెలిసిందే. కొరటాల ఆ చిత్రానికి దర్శకత్వం వహించారు. అందులో పోసాని ఓ కీలక పాత్రను పోషించారు.