ప్చ్‌..! లాక్ డౌన్ ఎత్తేసినా ఆ డ‌జ‌ను రిలీజ్ డౌటే!

tollywood

లాక్ డౌన్ పంచ్ కి థియేట‌ర్లు బంద్ అవ్వ‌డంతో సినిమాల రిలీజ్ ల‌న్నీ వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల్లానే వినోద‌ప‌రిశ్ర‌మ అల్ల‌క‌ల్లోలం అయ్యింది. ప్ర‌స్తుతం మార్చిలో రిలీజ్ కావాల్సిన సినిమాల‌న్నీ వాయిదా పడి పోగుప‌డి ఉన్నాయి. వీట‌న్నిటినీ షెడ్యూలింగ్ చేసేందుకు నానా తంటాలు ప‌డాల్సిన ప‌రిస్థితి ఉందిపుడు. ఏప్రిల్ 15న లాక్ డౌన్ ఎత్తేసినా.. ఆ వెంట‌నే వేటిని ఏ ప‌ద్ధ‌తిలో రిలీజ్ చేయాలి? అన్న‌దానిపై ఏమాత్రం స్ప‌ష్ఠ‌త లేదు. ఇక ఒకేసారి లాక్ డౌన్ ఎత్తేసినా కానీ ఇప్పుడున్న స‌న్నివేశంలో క‌రోనా వైర‌స్ ఫియ‌ర్ లో జ‌నం థియేట‌ర్ల వైపు వ‌స్తారా రారా? అన్న టెన్ష‌న్ అలుముకుంది. దీనివ‌ల్ల ఏప్రిల్ – మేలో సినిమాల్ని రిలీజ్ చేసేందుకు నిర్మాత కం ఎగ్జిబిట‌ర్ కం పంపిణీ వ‌ర్గాలు ఆస‌క్తిగా ఉన్నాయా లేదా? అన్న సందిగ్ధ‌త అలానే ఉంది.

ఇప్ప‌టికి ఏప్రిల్ – మే లో రిలీజ్‌ కోసం ఎన్ని సినిమాలు వెయిటింగ్ అంటే.. `వి` (నాని-సుధీర్), ప్ర‌దీప్ మాచిరాజు – 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?, రాజ్ త‌రుణ్ – ఒరేయ్ బుజ్జిగా, వైష్ణ‌వ్ తేజ్- ఉప్పెన, అనుష్క‌- నిశ్శబ్దం, రానా – అరణ్య, నో టైమ్ టు డై (ఇంగ్లీష్ డబ్), రెడ్, మాస్టర్ (తమిళ డబ్), బాహుబ‌లి నిర్మాత‌ల `ఉమా మహేశ్వర ఉగ్రా రూపస్య‌`, శ‌ర్వానంద్ శ్రీకారం, సాయి తేజ్‌- సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్ .. ఇవ‌న్నీ ఏప్రిల్ లో రావాల్సి ఉండ‌గా.. మే రిలీజ్ కి మ‌రికొన్ని వెయిటింగులో ఉన్నాయి. కృష్ణ అండ్ హిజ్ లీలా, ర‌వితేజ -క్రాక్, ఆకాష్ పూరి – రొమాంటిక్, నాగ‌చైత‌న్య‌- ల‌వ్ స్టోరి .. మేలో రిలీజ్ కావాల్సి ఉండ‌గా.. అప్ప‌టికైనా సాధ్య‌మ‌వుతుందా? ప్ర‌స్తుత క‌ల్లోలం అప్ప‌టికి చ‌ల్లారుతుందా? అన్న‌ది స‌స్పెన్స్ గా మారింది. అస‌లే అది వైర‌స్ మ‌హ‌మ్మారీ కావ‌డంతోనే అస‌లు చిక్కు. ఇత‌ర‌త్రా ఏ స‌న్నివేశం ఉన్నా వీట‌న్నిటినీ రిలీజ్ కి ప్లాన్ చేసి ఉండేవారే. అయితే వీళ్ల‌లో చాలా మంది డిజిట‌ల్ లో ఓటీటీ దారి వెతుక్కుంటున్నార‌ని.. ఇప్ప‌ట్లో రిలీజ్ సాధ్య‌మ‌య్యే ప‌ని కాద‌ని ఓ నిర్ణ‌యానికి వ‌చ్చార‌ని ప్ర‌చార‌మవుతోంది. అంతా న‌ష్ట‌పోయే కంటే ఉన్నంత‌లో ద‌క్కినంతా రాబ‌ట్టుకోవ‌డం అనే ప‌ద్ధ‌తిలో ప్లాన్ చేస్తున్నార‌న్న గుస‌గుస‌లు వేడెక్కిస్తున్నాయి.