వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన సంచలనాత్మక చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈ సినిమా మొత్తానికి వాయిదా పడకుండా మార్చి 29నే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల అవుతోంది. ఇక ఈ చిత్రానికి సెన్సార్ దగ్గర కూడా సమస్యలు వస్తాయని చాలా మంది ఎదురుచూసారు. కానీ అవేమీ ఎదురుకాకుండా రిలీజ్ కు వచ్చేయటం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది..మింగుడు పడని పరిస్దితి క్రియేట్ చేస్తోంది. సినిమాకు ‘క్లీన్ యు’ సర్టిఫికెట్ ఇచ్చి విడుదలకు ఓకే చెప్పింది సెన్సార్ బోర్డు.
సినిమాలో అనేక వివాదాస్పద అంశాలు ఉండే అవకాశం ఉందని ప్రచారం జరిగిన నేపథ్యంలో సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుందని, కట్స్ సజెస్ట్ చేస్తుందని.. రిలీజ్ అవదు అనుకున్న వాళ్లకు నోట్లో కరక్కాయపడింది. కోర్టు కూడా ఈ సినిమాను ఆపాలంటూ తాము ఆదేశాలివ్వలేమని స్పష్టం చేసిన నేపథ్యంలో విడుదలకు ఇక ఏ ఇబ్బందులూ లేవని తేలిపోయింది. దాంతో ఎన్నికలకు రెండు వారాల ముందుగా చంద్రబాబును, నందమూరి కుటుంబాన్ని ఇరుకున పెట్టే కథాంశంతో వస్తున్న ఈ చిత్రం తెలుగుదేశం పార్టీకి తలనొప్పే అవుతుందని అంతా భావిస్తున్నారు.
దాంతో మొదటి రోజు మార్నింగ్ షోకు పూర్తిగా తెలుగుదేశం అభిమానులు,నాయకులు, వైయస్ ఆర్ పార్టీవాళ్ళు హాజరవుతారని అంతా అంచనాలు వేస్తున్నారు.
రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ‘‘ తెలుగుదేశం పార్టీ జెండాను, గుర్తును ఎక్కడా చూపలేదు. టీడీపీ జెండాలోని కలర్‌ను మాత్రమే వాడాం. ఎన్టీఆర్ జీవితంలోని ఓ భాగాన్ని సినిమాలో చూపించాం. లక్ష్మీపార్వతి రాసిన పుస్తకం ఆధారంగానే సినిమా తీశాం. ఆనాడు జరిగిన సంఘటనలను మాత్రమే సినిమాలో చూపించాం.’’ అని తెలిపారు.