“లక్ష్మీస్ ఎన్టీఆర్ ” ఓ ఫిరంగి .. లక్ష్మి పార్వతి (వీడియో)

“మహానుభావుడు మహా నటుడు, తెలుగు వారికి ఆరాద్యుడు అయిన నందమూరి తారక రామారావు భార్యగా 22 సంవత్సరాల నుంచి ఒంటరి పోరాటం చేస్తున్నా, మానసికంగా నలిగిపోయాను, నిరాశ, నిస్పృహతో అలసిపోయాను, ఆ నిజాలు నాతోనే సమాధి అయిపోతాయేమో అని మధన పడ్డాను. నాకు ఆశా కిరణంగా రామ్ గోపాల్ వర్మ, రాకేష్ రెడ్డి కనిపించారు.మరుగున పడ్డ మహనీయుని చరిత్ర వెలుగులోకి తీసుకొస్తామని చెప్పడంతో నా మనస్సు ఎంతో ఆనందంగా, తృప్తిగా వుంది” అని చెప్పారు నందమూరి లక్ష్మి పార్వతి. 

శుక్రవారం నాడు తిరుపతిలో వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రకటించిన తరువాత అదే వేదిక మీద నుంచి ఆమె మాట్లాడారు “రామారావు గారు ప్రారంభించిన పార్టీని అల్లుళ్ళు తీసుకుపోయారు, కొడుకులు డబ్బును తీసుకున్నారు, ఎన్టీఆర్ కు వారు చేసిన అన్యాయం, ద్రోహం  ఏమిటో వర్మ గారు  దాన్ని తెర మీద చూపండి, నేను చెప్పేదో, వారుచెప్పేదో కాదు వాస్తవంగా జరిగిందేమిటో  ప్రజలకు వివరించండి ” అన్నారు.

 “పెళ్ళికి ముందు, పెళ్ళికి తరువాత నన్ను ఎంత వేధింపులకు గురిచేసారో, మానసికంగా ఎంత  నలిగిపోయానో నాకు తెలుసు. వివాహం అయిన తరువాత జరిగిన ఎన్నికల్లో 258 సీట్లు గెలిపించుకొని వస్తే ముఖ్య మంత్రిగా 8 నెలలు తిరగకుండానే ఏవో కుంటి సాకులు చూపి ఆయన్ని కుర్చీ నుంచి దించి వేశారు. ఆయన పెట్టిన తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు గా తొలగించారు.

ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని చెప్పిన ఓ దుర్మార్గుడు గురించి ప్రజలకు తెలియాల్చిన అవసరం ఎంతో ఉంది” అన్నారు రామ్ గోపాల్ వర్మ తీస్తున్న ఈ సినిమా ద్వారా నేను ఏమైతే  ప్రజలకు తెలియాలని అనుకుంటున్నానో, అవ్వన్నీ వెలుగు చూస్తాయని ప్రగాఢ నమ్మకం  నాకుందని లక్ష్మి పార్వతి ఆశాభావం వ్యక్తం చేశారు.