ఇలా అయితే కష్టమే.. అసలేం జరుగుతోంది?
తెలుగు చలన చిత్రపరిశ్రమలో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే షూటింగులకు ప్రభుత్వాలు అనుమతులిచ్చేయడంతో సీరియల్ షూటింగులు ప్రారంభమయ్యాయి. అయితే ఆన్ లొకేషన్ నటీనటులకు కరోనా వైరస్ సోకడం కలకలం రేపుతోంది. ఒక ప్రముఖ సీరియల్ నటుడు.. ఒక ప్రముఖ సీరియల్ నటి ఇప్పటికే కరోనాకు చికిత్స పొందుతున్నారు. పలువురు సెట్ కార్మికులకు పాజిటివ్ రావడంతో అందరినీ క్వారంటైన్ కి పంపించారు.
సాక్షాత్తూ సీఎం కేసీఆర్ పేషీలోనే 30 మందికి కరోనా వచ్చిందంటే ఇక పరిశ్రమలో పరిస్థితి ఎలా ఉంటుందో!! అన్న బెంగ మొదలైందట. జీహెచ్‌ఎంసీని వైరస్ అట్టుడికిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితిలో షూటింగులకు వెళ్లాలంటేనే స్టార్ హీరోలు.. టెక్నీషియన్లు సహా నటీనటులు ఒణికిపోతున్నారు. ఈలోగానే టాలీవుడ్ లో తొలి కరోనా మరణం కలకలం రేపింది.
తాజా సమాచారం ప్రకారం.. ఈతరం బ్యానర్ అధినేత పోకూరి బాబూరావు సోదరుడు రామారావు (64) కరోనాకు చికిత్స పొందుతూ మరణించారు. పోకూరి రామారావు ఇంతకుముందు తన సోదరుని సినిమాలకు సమర్పకులుగా కొనసాగారు. పలు చిత్రాల షూటింగుల్లో పాలుపంచుకున్నారు. ఆయన మృతి చెందారన్న వార్తతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా భయాందోళన మొదలైంది.
బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ రవికృష్ణ… సీరియల్ నటి నవ్య.. టీవీ నటుడు ప్రభాకర్ కరోనాకు చికిత్స పొందుతున్న సంగతి విధితమే. కేవలం యూసఫ్ గూడ- కృష్ణానగర్ పరిసరాల్లోనే దాదాపు 70 మంది పైగా కరోనా పాజిటివ్ కేసులు విస్తరించాయన్న వార్త నటీనటుల వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతుండడం చూస్తుంటే అందరిలో ఆందోళన నెలకొంది. అలాగే ఫిలింనగర్ స్లమ్ లోనూ కరోనా కేసుల కలకలం.. సినీకార్మికులు నివాసం ఉండే చిత్రపురి కాలనీలో ఐదారు పాజిటివ్ కేసులు రావడం ఇదంతా చూస్తుంటే మహమ్మారీ విలయం ఏ రేంజులో ఉందో అర్థం చేసుకోవచ్చు.