నందమూరి కళ్యాణ్ రామ్ తాజా చిత్రం ‘118’ మొన్న శుక్రవారం విడుదల అయ్యింది. ఈ సినిమా ద్వారా దర్శకుడుగా ప్రముఖ కెమెరామెన్ కేవీ గుహన్ పరిచయం అయ్యారు. సాలీడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న కళ్యాణ్ రామ్ కు ఈ సినిమా ఎంతో కీలకమైనటంలో సందేహం లేదు. ఈ నేపధ్యంలో ఈ సారైనా కళ్యాణ్ రామ్ హిట్ కొట్టారా లేదా అని అందరూ ఎదురుచూస్తున్నారు.
అందుతున్న సమాచారం బట్టి ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ‘118’కు మొదటి రోజు మల్టిఫ్లెక్స్ లలో తప్ప హౌస్ ఫుల్స్ పడలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే రూ.1.5 కోట్ల షేర్ వచ్చింది.అయితే రెండో రోజు వసూళ్లలో మరీ డ్రాప్ కనపడకపోవటం కాస్త రిలీఫ్ ఇచ్చింది. కాకపోతే ఆదివారం ‘118’ బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ బాగుంది. తొలి రోజు కంటే కూడా మూడో రోజు ఎక్కువ వసూళ్లు రావడం విశేషం.మెల్లిగా మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్య సినిమా నిలబడే దిశగా ముందుకు వెళ్తోందన్నమాట.
రెండు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 5.50 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి, బయ్యర్ల పెట్టుబడిలో 40 శాతం రాబట్టినట్టు చెబుతున్నారు. దాంతో కల్యాణ్ రామ్ కి హిట్ పడిందనే వినపడుతోంది. ఈ రోజు శివరాత్రి కాబట్టి కలెక్షన్స్ బాగుంటాయి. రేపటి నుంచి ఇదే పరిస్దితి కొనసాగితే అందరూ ఫుల్ హ్యాపీ. ఈ సినిమా తరువాత ఆయన దర్శకుడు శ్రీవాస్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు చెప్పుకుంటున్నారు.
కళ్యాణ్ రామ్ కు జోడీగా నివేద థామస్.. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలిని పాండే హీరోయిన్లుగా నటించారు. శేఖర్ చంద్ర ఈ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని మహేష్ కోనేరు నిర్మించారు.