ట్విట్టర్ లో ఎన్టీఆర్ స్పీడు..! తక్కువ ట్వీట్లతో అరకోటి ఫాలోవర్లు

ఎన్టీఆర్.. నందమూరి వంశంలో మూడో తరం హీరోగా చిన్న వయసులోనే ఎంట్రీ ఇచ్చి సంచలనాలు రేపాడు. బాల నటుడిగా శ్రీరాముడి పాత్రలో తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన రెండో ఏడాదే ఆది సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని స్టార్ హీరో అయిపోయాడు. మూడో ఏడాదే సింహాద్రి సినిమాతో మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. అప్పటినుంచీ ఎన్టీఆర్ తిరిగి చూసింది లేదు. సూపర్ క్రేజ్, మాస్ ఫ్యానిజంతో దూసుకుపోతున్నాడు. వరుస సక్సెస్ ల్లో ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు సోషల్ మీడియా వేదిక ట్విట్టర్లో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.

ఎన్టీఆర్ ను ట్విట్టర్లో ఫాలో అయ్యే అభిమానుల సంఖ్యను 5 మిలియన్లకు పెంచుకున్నాడు. ఈ మార్కును టాలీవుడ్ లో చేరుకున్న అయిదవ హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు. ఎన్టీఆర్ కంటే ముందు.. మహేశ్ బాబు, రానా దగ్గుబాటి, నాగార్జున, అల్లు అర్జున్ ఉన్నారు. తక్కువ సమయంలోనే ఈ ఘనత వహించిన స్టార్ హీరోగా కూడా రికార్డు సృష్టించాడు. పైగా.. ట్విట్టర్లో తారక్ కంటే ముందున్న హీరోల కంటే.. టాలీవుడ్‌లోని మిగిలిన హీరోల కంటే కూడా జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్‌గా ఉండడు. ఎన్టీఆర్ చేసే ట్వీట్లు కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి. అయినా కూడా ఎన్టీఆర్ ను ఫాలో అయ్యే వారి సంఖ్య పెరగడం విశేషం.

 

మరోవైపు.. ఎన్టీఆర్ కు ఇన్ స్టాగ్రామ్ లో 2.6 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఫ్యామిలీ ఫొటోలు, పిల్లల సరదాలు.. ఇవేమీ ఎన్టీఆర్ పోస్ట్ చేయడు. కేవలం తన సినిమా అప్డేట్స్.. మరికొన్ని ఇంపార్టెంట్ విషయాలు తప్పితే ఎన్టీఆర్ సోషల్ మీడియా యాక్టివ్ నెస్ తక్కువ. ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. తర్వాత తన 30వ సినిమాగా కొరటాల శివతో సినిమా చేయబోతున్నాడు. ఇటివలే కరోనా బారి నుంచి కోలుకున్నాడు కూడా. ఈ సంతోషంలో ఉన్న ఫ్యాన్స్ ఇప్పుడు ఎన్టీఆర్ ఈ అరుదైన ఫీట్ సాధించినందుకు ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.