ఆత్మలు చెప్పిన కథలతో సినిమాలు చేస్తున్నానంటున్నారు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి. రామ్ గోపాల్ వర్మ సినిమా ఎనౌన్స్ చేయగానే వెంటనే అదే టైప్ కాన్సెప్టుతో సినిమాలు ఎనౌన్స్ చేస్తున్న జగదీశ్వరరెడ్డి తనకు ఆత్మలు వచ్చి విషయాలు చెప్పటం వల్లే సినిమాలు చేస్తున్నట్లు మాట్లాడుతున్నారు.
వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ కు ప్రతిగా.. ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమాని తెరకెక్కించిన జగదీశ్వరరెడ్డి ఇప్పుడు వర్మ జయలలిత, శశికళకు మధ్య అనుబంధంతో ఓ చిత్రం చేస్తున్నారనగానే… ‘శశి లలిత’ అనే చిత్రం ప్రకటించారు. జయలలిత ఆస్పత్రిలో ఉన్న 75 రోజుల ఘట్టమే ప్రధాన ఇతివృత్తంగా ‘శశి లలిత’ పేరిట ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాకు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దర్శకత్వం వహించనున్నారు.
ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ ‘జయలలితపై ఉన్న అభిమానంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నా. ఆమె జీవితంలో చోటుచేసుకున్న అన్ని కీలకమైన విషయాలు ఇందులో ఉంటాయి. ఇవన్నీ జయలలిత ఆత్మ చెప్పిన విషయాలు. వాటి ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నా. ఆమె బాల్యం, నటిగా మారడం, రాజకీయ ప్రవేశం, జయతో తనకున్న పరిచయం వంటి విషయాలతో పాటు చికిత్స నిమిత్తం 75 రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్నప్పుడు జరిగిన విషయాలను ఇందులో ఉంచుతాం.
చిన్న వయస్సు నుంచి జయతో మరింత సన్నిహితంగా వ్యవహరించిన వ్యక్తులు చెప్పిన విషయాలను కూడా తీసుకున్నాం. ప్రజలకు తెలియని విషయాలతో ఈ సినిమా ఉంటుంది. గతంలో ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి జీవితం ఆధారంగా తెలుగులో ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ అనే చిత్రాన్ని కేతిరెడ్డి ప్రారంభించారు. అక్కడ కూడా ఎన్టీఆర్ ఆత్మ చెప్పిన విషయాల ఆధారంగా ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమాను రూపొందిస్తున్నట్లు’ పేర్కొన్నారు.
ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు. ఇప్పుడు జయలలిత ఆత్మ కూడా కొన్ని విషయాలు చెప్పిందని తద్వారా ‘శశి లలిత’ సినిమాను రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు జగదీశ్వరరెడ్డి.