బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న జాతిర‌త్నాలు..!

జాతిర‌త్నాలు ఊహించ‌ని విధంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము దులుపుతోంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఫేమ్ నవీన్ పొలిశెట్టి,ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధానపాత్రల్లో న‌టించ‌గా, ఫరియా అబ్దుల్లా చిట్టిగా మెరిసింది. కేవీ అనుదీప్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు నాగ అశ్విన్ నిర్మించిన సంగ‌తి తెలిసిందే. ప‌క్కా అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా తెర‌కెక్కిన జాతిర‌త్నాలు, థియేట‌ర్ల‌తో న‌వ్వులు పూయిస్తోంది.

Jathi RatnaluThe biggest release of 2021 so far in USA
Jathi ratnalu

మొద‌టి ఆట‌నుండే హిట్ టాక్ సొంతం చేసుకున్న‌ జాతిరత్నాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ క‌లెక్ష‌న్లు కొల్ల‌గొడుతోంది. చిన్న సినిమాగా తెర‌కెక్కిన ఈ చిత్రం, ఎలాంటి అంచ‌నాలు లేకుండా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి రికార్డు స్థాయిలో క‌లెక్ష‌న్లు సాధిస్తుంది. దీంతో ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా జాతిర‌త్నాలు గురించే పెద్ద ఎత్తున టాక్ న‌డుస్తోంది. సోష‌ల్ మీడియాలో అయితే జాతిరత్నాలు గురించి ఓ రేంజ్‌లో చర్చ నడుస్తోంది.

ఇక సినీ ప్రుముఖులంద‌రూ జాతిర‌త్నాలు గురించే ట్వీట్ చేస్తూ, ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సొంతం చేసుకుని లాభాల బాట‌లో దూసుకుపోతున్న జాతిర‌త్నాలు, యూఎస్‌లో సైతం మంచి క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఇప్ప‌టి వ‌ర‌కు యూఎస్‌లో జాతిరత్నాలు దాదాపు హాప్ మిలియన్ డాలర్ వసూళ్లను సాధించి దూసుకుపోతుంది.

దీంతో అక్క‌డ గ‌తంలో ప‌లు చిత్రాలు సాధించిన రికార్డు బ‌ద్ధ‌లు కావ‌డం గ్యారెంటీ అని ట్రేడ్ పండితులు అంచ‌నా వేస్తున్నారు. కాగా ఇప్ప‌టి వ‌ర‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో 16.52 కోట్ల షేర్ వ‌సూలు చేసిన జాతి ర‌త్నాలు, రెస్టాఫ్ ఇండియాలో 61 లక్షలు, ఓవర్సీస్‌లో 3.31 కోట్లు వ‌సూలు చేసింది. దీంతో ప్ర‌పంచ వ్యాప్తంగా నాలుగు రోజుల్లో దాదాపు 20 కోట్లుకు పైగానే జాతిర‌త్నాలు క‌లెక్ట్ చేయ‌డం విశేషం. దీంతో జాతిర‌త్నాలు విజ‌యం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో మంచి ఊపుతెచ్చింద‌ని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు.