గ్యాంగ్ లీడర్ కోసం వాల్మీకి సైడిచ్చాడా?
మన హీరోల మధ్య అండర్ స్టాండింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాలా? ఒకరితో ఒకరు స్నేహంగా కలిసిపోతుంటారు. ఒక్కోసారి హీరోలంతా కలిసి పార్టీలకు ఎటెండవుతుంటారన్న సంగతి తెలిసిందే. ఏడాది క్రితం అల్లు అర్జున్, రానా లాంటి స్టార్లు ప్రత్యేకించి టాలీవుడ్ యువహీరోలు అందరినీ పిలిచి పార్టీలు ఏర్పాటు చేశారు. అందరితో సరదాగా కలిసిపోయి ఒక సుహృద్భావ వాతావరణం కల్పించారు. అయితే ఆ పార్టీల ప్రభావమో ఏమో కానీ ఒక హీరోకి ఇంకో హీరోకి మధ్య అస్సలు క్లాష్ అన్నదే లేదు నాటి నుంచి. ఇక రిలీజ్ సమయంలో అది మరింతగా కలిసొస్తోంది. వివాదాలు తలెత్తకుండా థియేటర్ల మేనేజ్‌మెంట్ కి ఇది ప్లస్ అవుతోంది.
ఇప్పటికే పలుమార్లు అగ్ర హీరోల సినిమాల రిలీజ్ వేళ క్లాషెస్ వస్తే తెలివిగానే పరిష్కరించుకునేందుకు ప్రయత్నించారు. ఒకరితో ఒకరు రాజీ బేరాలు కుదుర్చుకోగలిగారు. అలాగే యువహీరోలు సైతం రిలీజ్ తేదీల విషయంలో క్లాష్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం యంగ్ హీరోలు నాని- వరుణ్ తేజ్ సినిమాలు క్లాష్ అయ్యే సన్నివేశం వచ్చింది. అయినా సుహృద్భావ వాతావరణంలో ఆ ఇద్దరూ సమస్యను పరిష్కరించుకుంటున్నారని తెలిసింది. నేచురల్ స్టార్ నాని నటించిన సినిమాకి మెగా హీరో వరుణ్ తేజ్ ఎలాంటి భేషజం లేకుండా సైడివ్వడం హాట్ టాపిక్ గా మారింది. నాని నటించిన నానీస్ గ్యాంగ్ లీడర్ యథాతథంగా సెప్టెంబర్ 13న రిలీజవుతుంటే, అదేరోజు రిలీజ్ కావాల్సిన వరుణ్ తేజ్ `వాల్మీకి` చిత్రం సెప్టెంబర్ 20 నాటికి వాయిదా పడింది.
మాటల్లేవ్ మాట్లాడుకోడాల్లేవ్ అనకుండా..
నాని నటిస్తున్న గ్యాంగ్ లీడర్ చిత్రానికి విక్రమ్.కె.కుమార్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి సంస్థ నిర్మిస్తోంది. వాల్మీకి చిత్రానికి గబ్బర్ సింగ్ ఫేం హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా 14 రీల్స్ సంస్థ నిర్మిస్తోంది. మైత్రి అధినేతలు రవి -నవీన్ లతో 14రీల్స్ అధినేతలు గోపి-రామ్ మంతనాలు సాగించారని తెలుస్తోంది. అయితే వాల్మీకి వాయిదా సంగతిని 14 రీల్స్ వాళ్లు ప్రకటించాల్సి ఉందింకా. మొత్తానికి మాటల్లేవ్ మాట్లాడుకోడాల్లేవ్ అనకుండా రిలీజ్ సమస్యను పరిష్కరించుకున్నారన్నమాట.