”లక్ష్మీస్ ఎన్టీఆర్” : ఓవర్ సీస్ ఆఫర్ కు షాకైన వర్మ

తెలుగువారి అభిమాన నటుడు నందమూరి తారక రామారావు పై ఇప్పటికే క్రిష్ డైరక్ట్ చేసిన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం వచ్చింది. అయితే అది కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. కానీ అందులో వివాదాస్పద అంశాలు లేకపోవటం వల్లే సినిమాపై పెద్ద ఆసక్తిని జనం చూపించలేదని చెప్పుకున్నారు. అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ ..ఆ లోటుని తీరుస్తుందంటున్నారు.

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ”లక్ష్మీస్ ఎన్టీఆర్” పేరిట ఎన్టీఆర్ చరమాంక జీవితం ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించిన దగ్గర నుంచి నడిచిన కథను రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాలో చూపించనున్నారు.దాంతో ఈ సినిమాపై బిజినెస్ వర్గాల్లో క్రేజ్ ఏర్పడటం సహజం.

త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమా బిజినెస్ ఎంక్వైరీలు ప్రారంభమయ్యాయి. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. రీసెంట్ గా ఓవర్ సీస్ నుంచి ఓ మంచి ఆఫర్ వచ్చిందిట. వాళ్లు ఆఫర్ చేసిన మొత్తం విని రామ్ గోపాల్ వర్మ తో సహా టీమ్ మొత్తం స్టన్ అయ్యారట.

అయితే వర్మ మాత్రం ఆ ఆఫర్ కు ఎస్ కానీ, నో కానీ చెప్పలేదట. ట్రైలర్ రిలీజ్ అయ్యాక మాట్లాడటం అని చెప్పారట. సాధారణంగా ఓవర్ సీస్ లో ఎంటర్టైన్మెంట్ సినిమాలు చూస్తారు. పొలిటికల్ సినిమాలకు పెద్ద నో చెప్తారు. అలాంటిది అంతంత బారీ రేటు పెట్టి ఎలా కొందమని ముందుకు వచ్చారో అర్దం కావటం లేదంటున్నారు ఇక్కడ ట్రేడ్ జనం. దానికి తోడు ఎన్టీఆర్ కథనాయకుడు ఓవర్ సీస్ లో డిజాస్టర్ అవటం జరిగింది. రాకేశ్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాను జీవీ ఫిల్మ్స్‌ సంస్థ సమర్పిస్తోంది.

ఎన్టీఆర్ వ్యక్తిగతాన్ని ఈ సినిమాలో చూడొచ్చునని వర్మ అన్నారు. క్రిష్ రూపొందిస్తున్న కథానాయకుడులో ఎన్టీఆర్ సినీ జీవితం, మహానాయకుడులో ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం చూస్తే.. లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో తారక రామారావు గారి వ్యక్తిగత జీవితం వుంటుంది. ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఈ సినిమా చూడొచ్చునని వర్మ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ పెద్ద స్టార్. ఆయనకు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కానీ లక్ష్మీ పార్వతి విషయానికి వస్తే ఆమె ఓ సాధారణ మహిళ. పెద్ద అందగత్తె కూడా కాదు. అలాంటి ఆమె ఎన్టీఆర్‌కు ఎలా చేరువైంది.. అనేది ఈ సినిమాలో చూడొచ్చు. తన పరిశోధన కూడా అక్కడి నుంచే ప్రారంభమైందని వర్మ చెప్పుకొచ్చాడు.