హృతిక్ రోషన్ అభిమానులకు శుభవార్త!

భారత సూప‌ర్ హీరో ఎవ‌రు? అంటే బాలీవుడ్ కండ‌ల హీరో హృతిక్ రోష‌న్ పేరు వినిపిస్తుంది. యువత, పిల్ల‌లు స‌హా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్లోనూ అత‌డంటే ప్ర‌త్యేక‌మైన అభిమానం, ఆదరణ. హృతిక్ న‌టించిన క్రిష్ సిరీస్ అత‌డికి ఆ స్థాయి పేరు తెచ్చింది. క్రిష్ అంటే హృతిక్ మాత్ర‌మే అనేంత‌గా పాపుల‌ర‌య్యారు. క్రిష్, క్రిష్ 2, క్రిష్ 3 చిత్రాల‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆద‌ర‌ణ ల‌భించింది. క్రిష్ 3 అత్యంత భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కి అదే స్థాయిలో వ‌సూళ్లు తేవ‌డం తెలిసిందే.

అయితే క్రిష్ సిరీస్ లో నాలుగో సినిమా తెర‌కెక్క‌బోతోందంటూ గ‌త రెండేళ్లుగా చాలా వార్త‌లు వచ్చాయి కానీ ఇప్ప‌టివ‌ర‌కూ ప్రారంభం కాలేదు. ఇప్ప‌టికే ప‌లుమార్లు క్రిష్ 4 ప్రారంభిస్తున్నామ‌ని నిర్మాత రాకేష్ రోష‌న్ ప్ర‌క‌టించారు. కానీ ఎందుక‌నో ఇప్ప‌టివ‌ర‌కూ ప్రారంభం కాలేదు. అప్ప‌ట్లోనే రాకేష్ రోష‌న్ క్రిష్ 4ను లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేసినా ర‌క‌ర‌కాల వివాదాలు అడ్డంకిగా మారాయని చ‌ర్చ సాగింది. బ‌డ్జెట్ స‌మ‌స్య‌లు, హృతిక్ వ్య‌క్తిగ‌త జీవితంలో క‌ల‌త‌లు ఈ ఆల‌స్యానికి కార‌ణం అంటూ చెప్పుకున్నారు.

అయితే ఎట్ట‌కేల‌కు రోష‌న్ ఫ్యామిలీ నుంచి అన్ని ర‌కాలుగా లైన్ క్లియ‌ర్ అయ్యింద‌ని అర్థ‌మ‌వుతోంది. క్రిష్ 4 చిత్రాన్ని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ప్రారంభించేందుకు హృతిక్- రాకేష్ రోష‌న్ బృందం ప్ర‌ణాళిక‌ల్లో వేగం పెంచార‌ని తెలుస్తోంది. 2020 సెప్టెంబ‌ర్‌లో సినిమాని ప్రారంభించే ఆలోచ‌న ఉంది. రాకేష్ ప్ర‌స్తుతం స్క్రిప్టు ప‌నుల్ని పూర్తి చేస్తున్నార‌ట‌. ఈ సినిమాని పార్ట్ 3 కంటే భారీ బ‌డ్జెట్ తో నిర్మించే అవ‌కాశం ఉంద‌న్న ప్ర‌చారం ఇప్పటికే సాగింది. ఈ నేప‌థ్యంలో క్రిష్ అభిమానుల‌కు ఇది శుభ‌వార్త అనే చెప్పాలి.