గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల పోలింగ్ మొదలైంది. జీహెచ్‌ఎంసీ పాలకమండలి పదవీకాలం ఫిబ్రవరి 10, 2021తో ముగియనున్నప్పటికీ… రెండు నెలల 10 రోజుల ముందుగానే ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలిగ్ జరగనుండగా, ఓటర్లు ఉత్సాహంతో పోలింగ్ కేంద్రానికి బారులు తీరుతున్నారు. సినీ సెలబ్రిటీలు కూడా ఇందులో భాగం అవుతుండడం ఉత్సాహాన్ని ఇస్తుంది.
కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా గ్రేటర్ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా, మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి ఫిలింనగర్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి, రచయిత పరచూరి గోపాల కృష్ణ, ఉషా ముల్పూరి, దర్శకుడు క్రిష్,ఆలీ, యాంకర్ ఝాన్సీ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు బాద్యతగా ఓటు వేయాలని చెప్పారు. సెలవు ఇచ్చారని ఇంట్లో కూర్చోకుండా భావితరాలని నిర్దేశించే సరైన నాయకుడిని ఎన్నుకోవాలని, ఏమి ఆశించకుండా ఓటు వేసినప్పుడే అభివృద్ది గురించి నాయకులని అడిగే హక్కు మనకు దక్కుతుందని అలీ అన్నారు
కాచిగూడలోని దీక్షా మోడల్ స్కూల్ పోలింగ్ బూత్‌లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలానే మంత్రి కేటీఆర్ బంజారాహిల్స్‌లోని నందినగర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు వేసే వారికే నిలదీసే హక్కు ఉంటుందని ఆయన చెప్పారు. పెద్ద ఎత్తున ఓటు వేసేందుకు తరలి రావాలని ఆయన కోరారు. నాంపల్లి వ్యాయామశాల హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఓటు వేశారు. కుందన్ బాగ్ చిన్మయి స్కూల్‌లో రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంబర్ పేట ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ఓటు వేశారు.
ఇక ఎంఐఎం అధ్యక్షుడు ఎంపీ అసదుద్దీన్ శాస్త్రిపురంలో ఏర్పాటు చేసిన ఓటింగ్ కేంద్రంలో ఓటు వేశారు. బోరబండలోని సైట్‌వన్ పోలింగ్ కేంద్రంలో ఉపమేయర్ బాబా ఫసియుద్దీన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.