`హిరణ్యకశిప` యానిమేషన్ కోసం అంత ఖర్చు?
హాలీవుడ్ తరహాలోనే స్టోరీబోర్డ్ రెడీ చేసి ప్రీవిజువల్స్ ని సిద్ధం చేసి అప్పుడు సెట్స్ కెళ్లే ఆనవాయితీని ఇప్పుడు రానా-గుణశేఖర్-సురేష్ బాబు బృందం అనుసరిస్తున్నారు. ఈ కాంబినేషన్ ఒకరకంగా సాహసాలకే సిద్ధమవుతున్నారని చెబితే అతిశయోక్తి కాదు. భారతీయ పురాణేతిహాసం నుంచి హిరణ్యకశిపుని కథాంశాన్ని ఎంచుకోవడమే ఒక సాహసం అనుకుంటే ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో హాలీవుడ్ రేంజులో తెరకెక్కించే ప్రయత్నం చేయడం మరో సాహసం.
అయితే ఇంకా ఒక్క షాట్ అయినా తీయక ముందే అప్పుడే 15కోట్లు హాంఫట్! అంటూ ప్రచారం సాగుతోంది. హిరణ్యకశిప లో క్యారెక్టర్లను డిజైన్ చేసి యానిమేషన్ లో విజువలైజ్ చేసేందుకు ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేశారని తెలుస్తోంది. అయితే ముందే విజువలైజ్ చేస్తే ఆ తర్వాత తీయడం చాలా సులువు. దానికి తగ్గట్టు లొకేషన్ ఎంపిక చేసుకుని బ్లూమ్యాట్.. గ్రీన్ మ్యాట్ లో షాట్స్ ని తెరకెక్కిస్తారు. గుణశేఖర్ బృందం దీనిపై చాలా కాలంగానే కసరత్తు చేస్తోంది. టెక్నాలజీని పెద్ద రేంజులోనే అడాప్ట్ చేసుకుని ఈ ప్రయత్నం చేస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కేవలం ప్రీవిజువల్స్ కే అంత ఖర్చు చేశారంటే మునుముందు సెట్స్ కి వెళితే ఇంకెంత ఖర్చు చేస్తారో చూడాలి. అయితే కరోనా మహమ్మారీ సన్నివేశం ఇలాంటి ప్రయత్నాలకు పూర్తిగా ఇబ్బందికరం.
బాలీవుడ్ లో క్రిష్ ఫ్రాంఛైజీ.. టాలీవుడ్ లో బాహుబలి ఫ్రాంఛైజీ తర్వాత మళ్లీ అంతకుమించిన సాహసాల్నే గుణశేఖర్ – రానా బృందం చేస్తున్నారు. డి.సురేష్ బాబు నుంచి అన్నివిధాలా సహకారం అందుతోంది. ఇక వీళ్లకు ఫాక్స్ స్టార్ స్టూడియోస్ లాంటి భారీ కార్పొరెట్ దిగ్గజం జాయిన్ అవ్వడంతో మరింత ఆసక్తి పెరిగింది. పాన్ ఇండియా కేటగిరీలో నెవ్వర్ బిఫోర్ అన్న రేంజులోనే ఈ సినిమాని తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.