‘ఆర్ ఎక్స్ 100’ హీరో కొత్త చిత్రం ‘హిప్పీ’ టీజర్

‘ఆర్ ఎక్స్ 100’ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో, హీరోగా కార్తికేయ ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చేసుకున్నాడు. దాంతో ఆయనను వెతుక్కుంటూ వరుస ఆఫర్స్ వస్తున్నాయి. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను ఎంచుకుంటూ కార్తికేయ ముందుకు వెళుతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన ఒక ద్విభాషా చిత్రాన్ని చేయడానికి అంగీకరించాడు .. ఆ సినిమా పేరే ‘హిప్పీ’. తమిళ .. తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ ఈ రోజున విడుదలైంది.

Hippi Movie Teaser | Karthikeya | Digangana Suryavanshi | Jazba Singh | TN Krishna | V Creations

టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెంచే పనిలో వున్నారు. కలైపులి తాను నిర్మిస్తోన్న ఈ సినిమాకి ఎన్.కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. హీరోయిన్ గా ఈ సినిమాతో ‘దిగాంగన’ పరిచయమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ పూర్తయింది. నివాస్ కె. ప్రసన్న అందించిన సంగీతం, ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని అంటున్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ‘‘రొమాంటిక్‌ కామెడీ చిత్రమిది. కార్తికేయ తన తొలి చిత్రం కన్నా చాలా భిన్నంగా ఇందులో కనిపిస్తాడు. పెద్దగా బరువు బాధ్యతలు తెలియని సరదా పాత్ర అతనిది. ఇందులో ఇద్దరు హీరోయిన్లుంటారు. ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టే సినిమా ఇది. మన నిత్య జీవితంలో చూసే ఎన్నో అంశాలు ఇందులో ఉంటాయి. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. ’’ అన్నారు.

నిర్మాత కలైపులి మాట్లాడుతూ ‘‘తెలుగులో ఎప్పట్నుంచో నేరుగా ఓ సినిమా తీయాలని అనుకుంటున్నా. అది ఇప్పటికి కుదిరింది. కార్తికేయ ‘ఆర్‌ఎక్స్‌ 100’ చూశాను. ప్రస్తుత యువతరానికి దగ్గరగా ఉన్న హీరో అనిపించింది. ఆయనతోనే ‘హిప్పీ’ తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు.

కార్తికేయ మాట్లాడుతూ ‘‘ఆర్‌ఎక్స్‌ 100’ తర్వాత ఇలాంటి ఓ పెద్ద సంస్థలో అవకాశం రావడం నా అదృష్టం. కథ చాలా బావుంది. తొలి సినిమా ఇచ్చిన సక్సెస్‌ను కొనసాగించే సినిమా అవుతుంది’’ అన్నారు. సంగీతం: నివాస్‌ కె. ప్రసన్న, కూర్పు: ప్రవీణ్‌ కెఎల్, ఛాయాగ్రహణం: ఆర్‌డి రాజశేఖర్‌.