హీరోగారి ట్విట్స్ కి  అర్ధాలే వేరులే !    

Ram Pothineni tweet to YS Jagan

Ram Pothineni tweet to YS Jagan

స్వతహాగా హీరో రామ్ కి సీనియర్ ఎన్టీఆర్ అంటే విపరీతమైన అభిమానం. పైగా తన కుటుంబ నేపథ్యం కూడా తెలుగు దేశం పార్టీ పై అభిమానాన్ని పెంచినట్టు ఉంది. లేకపోతే, సచలన ట్వీట్స్ చేయడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పై కుట్ర జరుగుతోందంటూ ఒక హీరో కామెంట్ పెట్టడం అంటే… చిన్న విషయం ఏమి కాదు. ఈ హీరోగారి ట్విట్స్ పై ప్రభుత్వాధికారులు చర్యలు కూడా తీసుకోవచ్చు. ఏ ఉద్దేశ్యంతో అలా కామెంట్స్ పెట్టాడో వివరణ అడగొచ్చు. అయినా, వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి పై పెద్ద కుట్ర జ‌రుగుతుందని అన్న హీరో, మళ్ళీ జగన్ ను త‌ప్పుగా చూపించ‌డానికి మరో కామెంట్ పెట్టాడు.

మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో.. జగన్ కి సలహా ఇస్తున్నట్టుగా… ‘వైఎస్ జగన్ గారు మీ కింద ప‌ని‌చేసే కొంత‌మంది మీకు తెలియ‌కుండా చేసే కొన్ని ప‌నుల వ‌ల్ల, మీ రెప్యుటేష‌న్ కీ‌, మీ మీద మేం పెట్టుకున్న న‌మ్మ‌కానికి డ్యామేజ్ కలుగుతోంది. వాళ్ల మీద ఓ లుక్కేస్తార‌ని ఆశిస్తున్నాం’ అంటూ తెలివిగా ట్వీట్ చేశాడు. దీని అర్ధం ఆ హీరోగారికి తప్ప ఇంకెవ్వరికి అర్ధం కాదేమో. ఇంతకీ ఈ హీరోగారి బాధకు కారణం.. స్వర్ణ ప్యాలెస్‌లో కొవిడ్‌ సెంటర్ నిర్వహించిన రమేశ్‌ ఆసుపత్రుల యజమాని రామ్‌కు అతి దగ్గరి బందువు. ఆ మాటకొస్తే కుటుంబ సభ్యుడు కూడా.

అందుకే రామ్ సోషల్‌ మీడియా వేదికగా తన అనుమానాలను బహిరంగ పరిచక తప్పలేదు. ‘హోటల్ స్వర్ణ ప్యాలస్ ని రమేష్ హాస్పిటల్స్ వాళ్లు కోవిడ్ సెంటర్ గా మార్చక ముందు , ప్రభుత్వం అక్కడ క్వారంటైన్ సెంటర్ నిర్వహించింది. అప్పుడీ అగ్ని ప్రమాదం జరిగి ఉంటే ఎవరిని నిందించే వాళ్లు ?’ అని ప్రశ్నిస్తూ రమేష్ హాస్పిటల్స్ తప్పు ఏమి లేదన్నట్టు ట్వీట్ చేశాడు. అలాగే ఫైర్ + ఫీజు ‌= ఫూల్స్ అంటూ మరో ట్వీట్‌ చేసిన రామ్.. ‘అంద‌రినీ ఫూల్స్ చేయ‌డానికే విష‌యాన్ని ఫైర్ నుంచి ఫీజు వైపు మ‌ళ్లిస్తున్నారా?’ అని తనలోని కోపాన్ని ఈ విధంగా ప్రశ్నించాడు. మరి రామ్‌ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పేవారే కరువయ్యారు.