హీరో హీరోయిన్‌ సెట్స్‌కి రాలేమ‌ని చెప్పేశార‌ట‌

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరిగినప్పటికీ లాక్ డౌన్లు ఎత్తేస్తున్నారు. దీంతో వినోద‌ప‌రిశ్ర‌మ‌కు చిన్నపా‌టి వెసులుబాటు ల‌భించింది. సినీ నిర్మాతలు తిరిగి చిత్రీకరణను ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నారు. డ‌జ‌ను సినిమాలకు ఇప్ప‌టికే పెండింగ్ షూట్లు క్లియ‌ర్ చేసే ప‌నిలో ఉన్నారు.

అయితే ప‌రిస్థితిని స‌మీక్షిస్తే పిల్లికి చెల‌గాటం.. ఎలుక‌కు ప్రాణ సంక‌టంలా సీన్ ఇంకా అయోమ‌యంగానే ఉంది. కొన్ని మినహాయింపులు మినహా ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఎత్తివేసినప్పటికీ, కరోనావైరస్ ముప్పు తగ్గలేదు. వాస్తవానికి ఇది ఇప్పుడు ఇంకా ఇంకా పెరుగుతోంది. పీక్స్ కి చేర‌బోతోంది. రాష్ట్రాల‌ ఆర్థిక నష్టం గురించి ప్రభుత్వాలు బెంబేలెత్తి ఏమీ చేయ‌లేని ధైన్యంలోకి వెళ్లిపోతున్నాయి. ప్ర‌స్తుతం ప్రజల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి.

ఇక వినోద పరిశ్ర‌మ వ‌ర‌కూ వ‌స్తే.. సినీ నిర్మాతలు ఆర్థిక భారం గురించి తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. కానీ నటులు మాత్రం ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్ట‌ప‌డ‌డం లేదు. లాక్ డౌన్ కారణంగా స్టార్ హీరోలు .. హీరోయిన్లు ఎటువంటి ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోరు. ఈ సమయంలో వారి ఆరోగ్యం గురించో లేక‌ పని ప్ర‌దేశాల్లో ప్రమాదాల గురించి వారు భయపడుతున్నారు.

చాలా మంది నిర్మాతలు షూట్ కి రావడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగినప్పుడు వారి హీరోలు .. హీరోయిన్ల నుండి నో అనే స‌మాధానమే వచ్చింది. భారతదేశంలో కరోనావైరస్ కేసులలో గణనీయమైన క్షీణత వచ్చేవరకు మేం కనీస రిస్క్ తీసుకోలేం అని చాలామంది చెప్పారు.ఇతర రాష్ట్రాల కథానాయికలు మాత్రమే కాదు, మన తెలుగు తారలు చాలా మంది తమ ఇళ్ల నుంచి బ‌య‌ట‌కొచ్చేందుకు ఇంకా సిద్ధంగా లేరు. మాన‌సికంగా ఎవ‌రూ డేరింగ్ గా లేర‌ట‌. ఇక ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం జూన్ 1 నుంచి జ‌రిగే వ‌కీల్ సాబ్ షూటింగుకి హాజ‌రు కావ‌డం లేదు. ఇత‌ర ఆర్టిస్టుల‌పైనే స‌న్నివేశాల్ని తెర‌కెక్కించి .. అంతా బావుంది అనుకుంటేనే ప‌వ‌న్ ని సెట్స్ కి ర‌ప్పించాల‌ని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నార‌ట‌. ముందుగా మాక్ డ్రిల్ మాత్రం సెట్స్ లో ప్లాన్ చేశారు.