ముద్దులు – మిణుగురులు – ప్రేక్షకుల మనుగడ! (‘24 కిస్సెస్‌’రివ్యూ)

**సికిందర్

వీధి బాలలతో ‘మిణుగురులు’ అనే అవార్డు సినిమా తీసిన దర్శకుడు అయోధ్యకుమార్ రెండో ప్రయత్నంగా మెయిన్ స్ట్రీమ్ లోకొస్తూ ఎరోటిక్ లవ్ స్టోరీ తీశాడు. యువప్రేక్షకుల ఆరాధ్య క్రేజీ హీరోయిన్ అయిన హెబ్బా పటేల్ ని శృంగార నాయికగా చూపిస్తూ, ‘గరుడవేగ’ నటుడు అదిత్ అరుణ్ శృంగార పురుషుడుగా, హీరోగా పరిచయం చేశాడు. 24 కిస్సుల్లో బూతు ఏదీ లేదనీ, చక్కగా సకుటుంబ సపరివారంగా చూడ వచ్చనీ హామీ ఇచ్చాడు. బాలీవుడ్ సినిమాల్లో సీరియల్ కిస్సర్ గా ఇమ్రాన్ ఒకప్పుడు సంచలనం సృష్టించాడు. ఇప్పుడు సినిమాల్లో లిప్ లాక్స్ రోటీనైపోయాయి. ఒకటీ అరా లిప్ లాక్స్ తో కిక్ తగ్గిందనో ఏమో, ఏకంగా 24 కిస్సులతో వేడి పుట్టించాలనుకున్నట్టుంది. దీనికి మాట పడకుండా ఓ థియరీ కనిపెట్టాడు. ఈ థియరీ ప్రకారం ప్రేమలో ఈ ముద్దులకి అర్ధమేమిటని దర్శకుడు చెబుతున్నాడు? ఇది తెలుసుకుందాం…

కథ
ఆనంద్ (అదిత్ అరుణ్) అనే అతను తన ప్రేమ కథ ఒక సైకియాట్రిస్టు (రావు రమేష్) కి అంచెలంచెలుగా చెప్తాడు. ఆనంద్ ఒక పిల్లల సినిమాలు తీసేమూవీ మేకర్. శ్రీలక్ష్మి (హేబ్బా హెబ్బా పటేల్) మాస్ కమ్యూనికేషన్స్ స్టూడెంట్. ఆనంద్ వాళ్ళ కాలేజీకి మూవీ మేకింగ్ మీద వర్క్ షాప్ నిర్వహించేందుకు పోతాడు. అలా పెరిగిన పరిచయంతో ఆమె తల మీద ముద్దు పెడతాడు. ఈ ముద్దు కర్ధం ఆమె గూగల్ చేసి తెలుసుకుంటుంది. ఒక ముద్దు కాదు, 24 ముద్దులు పెట్టుకున్న లవర్స్ ఇక విడిపోరని తెలుసుకుంటుంది. దీంతో అతడితో ముద్దుల పర్వానికి తెరతీస్తుంది. 13 ముద్దుల తర్వాత అతను ప్రేమించడం లేదని తెలుసుకుని గొడవపడుతుంది. 23 వ ముద్దుకి సెక్స్ కి సిద్ధపడుతుంది. ఇప్పుడు అతడికి పెళ్ళంటే, పిల్లలంటే ఇష్టం లేదని తెలుసుకుని హర్ట్ అవుతుంది. పైగా వేరే అమ్మాయిలతో అతడికి సెక్స్ సంబంధాలున్నాయని తెలుసుకుని షాక్ తింటుంది. ఇప్పుడేం చేసింది, అతనేం చేశాడనేది మిగతా కథ .

ఎలావుంది కథ

కథలో చెప్పిన 24 ముద్దుల థియరీకి ఆధారాలేమిటోచూపించలేదు. వాత్సాయనుడు కూడా చెప్పివుండడు. ఇది కల్పితమనుకోవాలి. దీన్ని ఎవరైనా అమ్మాయిలు పాటిస్తే కర్సయి పోతారు. ఈ కథలో చూపించినట్టుగా ముద్దుల పర్వంలో మధ్యలో ఎక్కడో శృంగార పర్వం కూడా ముగిసిపోవచ్చు. అప్పుడు లబోదిబోమనడమే ఈ కథలో లాగా. అయితే ఈ కథలోలాగా సినిమాటిక్ ఫార్ములా పరిష్కారాలతో బయటపడలేరు. సుఖాంతం చేసుకోలేరు. కాబట్టి ఈ 24 ముద్దుల కథని ప్రాక్టికల్స్ ఆలోచనలకి దూరంగా వుంటూ పైపైన అలా చూసేయాలి. అయితే ఈ ముద్దులు పోనుపోను బూతుగా మారిపోయిన సంగతిని కూడా సకుంటుంబ సపరివార ప్రేక్షకులు గుర్తించాలి. ఇంకా ఈ ముద్దుల కథ మధ్యలో, గతంలో దర్శకుడు తీసిన ‘మిణుగురులు’ కథని కూడా బోనస్ గా స్వీకరించగలగాలి. దర్శకుడు ‘మిణుగురులు’ హేంగోవర్ లోంచి ఇంకా బయటికి రావడంలేదు. శృంగార రసంలో అన్నంకోసం తపించే వీధిబాలల ఆక్రందనలు కూడా కలుపుకుని ఆరగించగల్గాలి.

ఎవరెలా చేశారు

ఈ మూవీ యూత్ ని ఉర్రూతలూగించే రోమాంటిక్ కామెడీ కాకపోవడంతో, హుషారైన పాత్రల్లో హెబ్బా పటేల్ ని చూసి వున్న యూత్ నీరుగారిపోక తప్పదు. ఇది ఎరోటిక్ లవ్ స్టోరీయే అయినా ప్రేమ వ్యవహారం వచ్చేసి రోమాంటిక్ కామెడీ కాక, నెమ్మదిగా బరువుగా సాగే సీరియస్ రోమాంటిక్ డ్రామా కావడంతో హెబ్బా పాత్ర యూత్ అప్పీల్ కి దూరమైపోయింది. ముద్దుల దృశ్యాల్లో కొన్ని సెకన్లు వేడి పుట్టించవచ్చు గానీ మిగిలినదంతా ఏడుపే. అసలామె అనుకున్న థియరీ కూడా తప్పే. 24 ముద్దులు పెట్టుకున్న జంట విడిపోరని ఏకపక్షంగా ఎలా అనుకుంటుంది. అతడికి కూడా చెప్పి, అతను ఒప్పుకుంటే ఇద్దరూ కలిసి ఆచరించవచ్చు. అతడికి తెలియకుండా సీక్రెట్ ఎజెండాగా పెట్టుకుంటే, 13 వ ముద్దుకే అతను పెళ్ళీ పిల్లలూ లేవు పొమ్మన్నాడు. అప్పుడా థియరీ తప్పని తేలిపోయిందిగా… అయినా అలాటి వాడితో ఇంకా ముందుకెళ్ళి ముద్దుల కోటా పూర్తిచేస్తూ, కాలు కూడా జారి ఏడుస్తూ కూర్చోవడమేమిటి. సోషల్ మీడియా రోజుల్లో ఎవరికెన్ని ఎఫైర్స్ వున్నాయో తెలుసుకోవడం కష్టమా?

అదిత్ అరుణ్ పాత్ర, నటన ఫర్వాలేదు. నెగెటివ్ పాత్ర ఎప్పుడూ దాని చేతలతో అది కరెక్ట్ గానే వుంటుంది. దీన్ని డీల్ చేసే హెబ్బాపటేల్ లాంటి పాజిటివ్ పాత్రతోనే జాగ్రత్త వహించక పోతే అభాసవుతుంది. అయితే అదిత్ నెగెటివ్ పాత్రని ఒక్క ఫార్ములా కలంపోటుతో పాజిటివ్ గా మార్చెయ్యడమే కథకి వెతుక్కున్న ఈజీ సొల్యూషన్. ఇక్కడే దర్శకుడు దొరికిపోయి సెకండాఫ్ కథ తేల్చేశాడు.

ఇక రావురమేష్ సైకియాట్రిక్ పాత్రతో చివరివరకూ హీరోకి విడతలు విడతలుగా సీన్లు వుంటాయి. పదిహేను ఫ్లాష్ బ్యాకులుగా కథ చెప్పడంతో ఈ పరిస్థితి వచ్చింది. హీరో ఒక ఫ్లాష్ బ్యాక్ పూర్తి చేయగానే రావురమేష్ దగ్గరికొస్తుంది అదే సీను. ఇద్దరూ అక్కడే కూర్చుని అలాగే మాట్లాడుకుని, ఇంకో ఫ్లాష్ బ్యాక్ మొదలెడతారు. దీంతో మార్పులేని దృశ్యాలతో రావురమేష్ పాత్ర బాగా నస పెట్టేస్తుంది.

ఉద‌య్ కెమెరా వర్క్ ఎరోటిక్ ఫీల్ ని పట్టుకుంటూ పోయెటిక్ గా వుంది. అలాగే వివేక్ ఫిలిప్‌ నేప‌థ్య సంగీతం సన్నివేశాల్ని రక్తికట్టించేలా వుంది. జోయ్ బారువా సంగీతంలోని పాటలు కూడా బావున్నాయి. నిజానికి ఈ పాటలతో ఇది మాంచి మ్యూజికల్ లవ్ స్టోరీ కావాల్సింది…స్టోరీయే ఎప్పుడూ తెలుగు సినిమాల్లో మిగతా కళాకారుల టాలెంట్ ని డిసప్పాయింట్ చేస్తుంది….


చివరికేమిటి

దర్శకుడు హీరో పాత్రని మూవీ మేకర్ గా చూపిస్తున్న అవకాశం తీసుకుని స్క్రీన్ ప్లే పండితుడు రాబర్ట్ మెక్ కీ ని అక్కడక్కడా ప్రస్తావించుకున్నాడు. కానీ ఆ రాబర్ట్ మెక్ కీ చెప్పిన వేవీ తన కథలో పాటించలేదు. కుదేసిన రెండు పాత్రలు పదేపదే చెప్పుకునే మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాకుల కథనంతో స్క్రీన్ ప్లే కుప్పకూలింది. ఈ కథకి మెయిన్ క్యారెక్టర్ ఎవరు? ఇది అంతుబట్టదు. ఈ కథ ఎవరి పరంగా నడిచింది? ఇదీ అర్ధం కాదు. ఈ కథలో గోల్ ఎవరికుంది? హెబ్బా పటేల్ కా? మరి ఫ్లాష్ బ్యాక్స్ ఆమె చెబుతున్నట్టు లేదేమిటి? ఆమెకి మాత్రమే తెలిసిన 24 ముద్దుల స్కీమ్ ని ఫ్లాష్ బ్యాకులతో హీరో చెప్పేస్తున్నాడేమిటి? ఇలాటి గజిబిజి ఎంతో వుంది. ఇక ఒక సినిమాలో తీసిన ఇంకో సినిమా కథలు చెప్పమని మెక్ కీ చెప్పాడా? ఇక్కడ ‘మినుగురులు’ గోలేమిటి? ఆ వీధి బాలల కోసం హీరో పోరాట మేమిటి? ఇది హీరోయిన్ ప్రేమ కథ, హీరో పోరాట కథ రెండూనా?
ఈ మూవీ కాన్సెప్ట్ కాడ్నుంచీ – కెమెరా, సంగీతం తప్ప – ప్రతీదీ ఫ్లాప్ కళలు నింపుకున్నవే. ఫ్లాష్ బ్యాకులతో ఫస్టాఫ్ ఎలాగూ భరించినా, సెకండాఫ్ చాలా సహనాన్ని పరీక్షిస్తుంది – కింది క్లాసు ప్రేక్షకులు ఆర్తనాదాలు చేసేలా!

Rating: 1.5 / 5

రచన – ద‌ర్శ‌క‌త్వం: అయోధ్య‌కుమార్
తారాగణం : అదిత్ అరుణ్, హెబ్బాప‌టేల్, రావు ర‌మేష్, న‌రేష్, అదితీ మైఖెల్ త‌దిత‌రులు
సంగీతం: జోయ్ బారువా, నేప‌థ్య సంగీతం: వివేక్ ఫిలిప్‌, ఛాయాగ్ర‌హ‌ణం: జి. ఉద‌య్
బ్యానర్స్ : సిల్లీ మాంక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, రెస్పెక్ట్ క్రియేష‌న్స్
నిర్మాత‌లు: స‌ంజ‌య్ రెడ్డి, అనిల్, అయోధ్యకుమార్
విడుదల : నవంబర్ 23, 2018